BENGAL: బెంగాల్ రాజకీయాల్లో కొత్త తుఫాన్
కేంద్రం-రాష్ట్రం మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
కోల్‌కతాలోని ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ కార్యాలయం, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన సోదాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, డెరెక్ ఓ’బ్రియన్ తదితరులు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి లాగేసి, అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో కోల్‌కతాలో ఈడీ సోదాలపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ చర్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తృణమూల్ పార్టీని బెదిరించడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. గురువారం ఈడీ సోదాల సమాచారం అందిన వెంటనే మమతా బెనర్జీ హుటాహుటిన ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడే ఉన్న ఈడీ అధికారుల ఎదుట నిరసన తెలిపారు. ఐ-ప్యాక్ కార్యాలయంలో తృణమూల్ పార్టీకి సంబంధించిన కీలకమైన డేటా, ఎన్నికల వ్యూహ పత్రాలు, అభ్యర్థుల సమాచారం ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకునేందుకే ఈడీ అధికారులు వచ్చారని ఆమె ఆరోపించారు. కొన్ని గంటల పాటు అక్కడ హైడ్రామా కూడా చోటుచేసుకుంది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో ఏర్పడిన ఐ-ప్యాక్ ప్రస్తుతం బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఐటీ, ప్రచార వ్యూహాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఐ-ప్యాక్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పార్టీ ఎన్నికల వ్యూహాలను దెబ్బతీయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
బొగ్గు కుంభకోణం నేపథ్యం
బెంగాల్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ మైన్స్ లో వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నగదు అక్రమ చలామణి వెలుగులోకి రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. స్థానిక వ్యాపారి అనూప్ మాఝీ (లాలా) ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇదే కేసులో తృణమూల్ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీను ఇప్పటికే ఈడీ విచారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయం, ఢిల్లీలోని నాలుగు ప్రాంగణాల్లో గురువారం ఉదయం ఏడు గంటల నుంచే ఏకకాలంలో ఈడీ సోదాలు ప్రారంభించింది. ప్రతీక్ జైన్ ద్వారా కొన్ని హవాలా లావాదేవీలు జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్‌కు చెందిన సంస్థకు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు.
తగిన రీతిలో స్పందిస్తాం: మమతా
సోదాల సమయంలో మమతా బెనర్జీ స్వయంగా ఐ-ప్యాక్ కార్యాలయానికి చేరుకుని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘‘రాజకీయ పార్టీ సమాచారాన్ని స్వాధీనం చేసుకోవడం ఈడీ విధుల్లో భాగమా?’’ అంటూ ప్రశ్నించారు. తమ పార్టీకి సంబంధించిన హార్డ్‌డిస్కులు, మొబైల్ ఫోన్లు, వ్యూహ పత్రాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ‘‘మా సమాచారాన్ని కాపీ చేయడం నేరం’’ అంటూ కేంద్రంపై మండిపడ్డారు. ఈడీ చర్యలకు నిరసనగా శుక్రవారం తన నాయకత్వంలో కోల్‌కతాలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని మమత ప్రకటించారు. తనను అడ్డుకుంటే తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు. ఈడీ మాత్రం తమ చర్యలు పూర్తిగా చట్టబద్ధమేనని, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సోదాల సమయంలో కీలక పత్రాలు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. మరోవైపు ఈడీ దర్యాప్తును మమత అడ్డుకున్నారని ఆరోపిస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఐ-ప్యాక్ కూడా సోదాల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.