Bengaluru: చెప్పులో దూరిన పాము కరిచి టెకీ మృతి
పాత ప్రమాదం కారణంగా కాలికి స్పర్శ లేకపోవడమే శాపం
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అత్యంత విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. తాను వేసుకున్న చెప్పులోనే నక్కిన పాము కాటేసినా, పాత గాయం కారణంగా కాలికి స్పర్శ లేకపోవడంతో ఆ విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఈ హృదయ విదారక ఘటన బెంగళూరులోని బన్నేరుఘట్ట పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బన్నేరుఘట్ట రంగనాథ లేఅవుట్‌లో నివాసముంటున్న మంజు ప్రకాశ్ (41) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో బయటి నుంచి తన క్రోక్స్ ఫుట్‌వేర్ వేసుకొని ఇంటికి వచ్చాడు. ఆ చెప్పులను బయట వదిలేసి, నేరుగా తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, అతడు ఇంటికి రాకముందే ఆ చెప్పులో ఓ పాము దూరిన విషయాన్ని గమనించలేదు.
దాదాపు గంట తర్వాత, ఇంటికి వచ్చిన ఓ కూలీకి మంజు ప్రకాశ్ చెప్పు పక్కన ఓ పాము చనిపోయి కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే మంజు ప్రకాశ్ గదిలోకి వెళ్లి చూడగా, అతను మంచంపై నోటి నుంచి నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పాము కాటు వేసిన కాలు నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మంజు ప్రకాశ్ సోదరుడు మాట్లాడుతూ, "ఇంటికి వచ్చాక ప్రకాశ్ నేరుగా గదిలోకి వెళ్లి పడుకున్నాడు. గంట తర్వాత ఓ కూలీ మా ఇంటికొచ్చి చెప్పుల దగ్గర చనిపోయిన పామును చూసి మాకు చెప్పాడు. అప్పుడు గదిలోకి వెళ్లి చూడగా ఈ దారుణం బయటపడింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులో ఇరుక్కుపోయి ఊపిరాడకపోవడం వల్లే పాము కూడా చనిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
2016లో జరిగిన ఓ ఘోర బస్సు ప్రమాదంలో మంజు ప్రకాశ్ కాలికి తీవ్ర గాయమైంది. శస్త్రచికిత్స అనంతరం ఆ కాలు స్పర్శను పూర్తిగా కోల్పోయింది. ఆ పాత గాయమే ఇప్పుడు అతడి పాలిట శాపంగా మారి, పాము కాటును కూడా గుర్తించలేని స్థితికి నెట్టి ప్రాణాలు తీసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.