Crime news: ప్రేమించి పెళ్లి చేసుకున్న నటిని పొడిచి పరారైన భర్త!
ఈ నెల 4న దారుణం.. తాజాగా వెలుగులోకి;
బెంగళూరులో ప్రముఖ టీవీ నటి శ్రుతి (అసలు పేరు మంజుల)పై ఆమె భర్త అమరేశ్ కిరాతకంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 4న మునేశ్వర లే అవుట్ ప్రాంతంలోని అద్దె ఇంటిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఆ రోజున పిల్లలు కాలేజీకి వెళ్లిన తర్వాత, అమరేశ్ (49) తన భార్యపై మొదట పెప్పర్ స్ప్రే ప్రయోగించి, అనంతరం కత్తితో పలుమార్లు పొడిచి, తలను గోడకు బాదాడు. తీవ్రంగా గాయపడిన శ్రుతిని అలాగే వదిలేసి పరారయ్యాడు. ప్రస్తుతం ఆమె విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
అమృతధార వంటి సీరియల్స్ ద్వారా పేరు పొందిన శ్రుతి 20 సంవత్సరాల క్రితం ఆటోడ్రైవర్ అయిన అమరేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రుతి భర్తను వదిలి సోదరుడితో నివసించసాగింది. అప్పట్లో పోలీసులకూ ఫిర్యాదు చేసింది. కానీ తరువాత రాజీ పడ్డారు. దీంతో గత గురువారం నుంచి తిరిగి కలిసి ఉండడం ప్రారంభించారు. అమరేశ్ తనను హత్యచేసేందుకు ప్రయత్నించాడన్న శ్రుతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అమరేశ్‌ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.