Bhagwant Mann: సీఎంను భోజనానికి పిలిచిన ఆటో డ్రైవర్.. తన ఆహ్వానాన్ని మన్నించి..
Bhagwant Mann: ఎన్నికల ప్రచారంలో నేతలు చేసే విన్యాసాలు అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు;
Bhagwant Mann: ఎన్నికల ప్రచారంలో నేతలు చేసే విన్యాసాలు అందరికీ తెలిసిందే.. ఈ విషయంలో ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. కానీ ఎన్నికలయ్యాక ఎవరు ఎలా ప్రవర్తిస్తారు అన్న దానిపైనే వారి విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియో ఈ విషయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ముందుకునడిచారు. ఎంతో మంది పేద వారి పూరి గుడిసెల్లోకి వెళ్లి భోజనం చేశారు. వారికి ఆనందాన్ని కలిగించారు.
మరోవైపు ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్... లుధియానాలో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభలో దిలీప్ అనే ఆటోవాలా లేచి నిల్చుని.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. అంతేకాదు.. తన ఆటోలోనే రావాలని కూడా కోరాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంపై సానుకూలంగా స్పందించిన కేజ్రీవాల్.. ఆటోవాలా ఆహ్వానాన్ని మన్నించారు.
మాట ఇచ్చినట్లుగా సీఎం భగవంత్ మాన్.. మరో ఆప్ నేత చీమా తో కలిసి... దిలీప్ సొంత ఆటోలోనే అతని ఇంటికి వెళ్లారు. అతని కుటుంబ సభ్యులు కొసరి కొసరి వడ్డించిన భోజనాన్ని ఇష్టంగా తిన్నారు. దిలీప్ ఆహ్వానం తనను అశ్చర్యపరచినప్పటికీ.. అతని ఆప్యాయత మాత్రం తనను ఆకట్టుకుందని అందుకే ఆయన ఇంటికి వచ్చానని కేజ్రీవాల్ చెప్పారు.
ఇక్కడే నెటిజన్లు నాయకుల మధ్య పోలిక చెబుతున్నారు. ఎన్నికలకు ముందు పేదల ఇళ్లలోకి వెళ్లే నేతలు.. ఎన్నికలయ్యాక వారి వైపు చూడడమే అరుదని.. అలాంటిది కేజ్రీవాల్.. ఓ పేదవాడి ఆహ్వానాన్ని మన్నించడమే కాకుండా.. భేషజాలు వదిలి అతని ఆటోలోనే ప్రయాణించడం గొప్ప విషయమని చెబుతున్నారు. అధికారం రాకముందు ముద్దులు... అధికారం వచ్చాక గుద్దులు అన్నట్లు నాయకులు ఉండకూడదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.