అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు 65 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ప్రతిపాదనకు బిహార్ అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. బిహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ప్రతిపాదనను మంగళవారం అసెంబ్లీ ముందు ఉంచారు. అనంతరం గురువారం ఈ బిల్లు మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ జరగ్గా.. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల కోసం ఆ కోటాను అమలు చేయాలని ఆ బిల్లులో తీర్మానించారు. అయితే రిజర్వేషన్ల విషయంలో 50 శాతం వరకే కోటా ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమాన్ని విధించిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్ అసెంబ్లీలో చేసిన తీర్మానం.. ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధనలను దాటి వేస్తుంది.
10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చిన కారణంగా, రిజర్వేషన్ మొత్తం కోటాను 75 శాతానికి పెంచాలని ఈ ప్రతిపాదన పెట్టే ముందు ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ కోటా పెంచాలని నితీశ్ డిమాండ్ అన్నారు. మరోవైపు కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు. ఇంతకు ముందు కుల ప్రాతిపదికన జనాభా గణన జరగనప్పుడు, కులాల సంఖ్య తగ్గిందని, పెరిగిందని ఎలా చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా బోగస్ ప్రచారమని, ఇలాంటివి చెప్పకూడదని నితీశ్ అన్నారు
అయితే ఆమోదం పొందినవ్ ఈ బిల్లుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సంతకం చేయాల్సి ఉంది. బిల్లులో ఉన్న సవరణలకు ఆమోదం తెలుపుతున్న సమయంలో ఇవాళ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రెండు రోజుల క్రితం మహిళలపై సీఎం నితీశ్ కుమార్ చేసిన కామెంట్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసన చేపట్టాయి.
కొత్త బిల్లు ప్రకారం.. ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఓబీసీలకు 18, ఈబీసీలకు 25 శాతం కోటా ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇక ఎస్టీలకు కేవలం రెండు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. గతంలో ఈబీసీలకు 18, బీసీకు 12, ఎస్సీలకు 16, ఎస్టీలకు ఒక శాతం కోటా మాత్రమే ఉండేది. వెనుకబడిన తరుగతి మహిళలకు ఉన్న మూడు శాతం రిజర్వేషన్‌ను రద్దు చేశారు.