Bihar Cm: పొరపాటు జరిగింది క్షమించండి!

జనాభా నియంత్రణ, శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2023-11-09 00:45 GMT

 జనాభా నియంత్రణకు మహిళా విద్యతో ఉన్న సంబంధాన్ని వివరించే క్రమంలో బిహార్ సీఎం నీతీశ్ కుమార్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన నీతీశ్ కుమార్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేసింది. జానకి పుట్టినగడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దారుణమని భాజపానేత విజయ్ సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నీతీశ్ మహిళలకు బేషరతు క్షమాపణ చెప్పాలన్నారు. నీతీశ్ పై ఇండియా కూటమి భాగస్వామ్యపక్షమైన సమాజ్ వాదీపార్టీ నేత జుహీసింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇకపై ఎవరూ ఇలా మహిళల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడవద్దని..ఆమె కోరారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ జనాభా నియంత్రణ, మహిళల విద్య పాత్రపై నీతీశ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళలు ఎంత ఎక్కువ చదువుకుంటే  వారు ఎప్పుడు పిల్లలను కనాలో నిర్ణయించుకుంటారని చెప్పవచ్చన్న ఓవైసీ నీతీశ్ సంజ్ఞలు, మాటలతో వివరించిన తీరు జగుప్సాకరమన్నారు. నీతీశ్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ కూడా మండిపడ్డారు. మధ్యప్రదేశ్ గుణలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన మోదీ అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలన్నారు. 

 జనాభా నియంత్రణలో మహిళల విద్య పాత్రపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో బిహార్ సీఎం నీతీశ్ కుమార్ క్షమాపణ చెప్పారు. మంగళవారం సభలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు  ఆయన బుధవారం  సభలోనే ప్రకటించారు. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం కావటంతో సీఎం నితీశ్‌కుమార్‌ బుధవారం నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ‘నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు తెలుపుతున్నా. జనాభా నియంత్రణలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పటం నా ఉద్దేశం. అంతే తప్ప ఎవర్నో కించపర్చాలన్నది నా ఉద్దేశం కాదు అంటూ నితీశ్‌ వివరణ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, ఆయనకు వ్యతిరేకంగా ముజఫర్‌పూర్‌ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. దీనిపై ఈనెల 25న కోర్టు విచారణ చేపట్టబోతున్నది. సీఎం నితీశ్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ‘జాతీయ మహిళా కమిషన్‌’ బీహార్‌ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ పంపింది. బీహార్‌ అసెంబ్లీలోనూ పలువురు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అయితే సీఎం నితీశ్‌ మాటల్ని వక్రీకరించకూడదని ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ మద్దతు పలికారు. ఇటీవల బీహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించి నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్‌ మాట్లాడుతూ ‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళలకు తన భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తున్నది’ అని మాట్లాడారు. 

Tags:    

Similar News