Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

సా.4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్

Update: 2025-10-06 04:45 GMT

బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్‌లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని పార్టీలు కోరాయి. ఈ నేపథ్యంలో రెండు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేసినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు బీహార్ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు దేశంలో అనేక ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది.

బీహార్‌లో దీపావళి తర్వాత అత్యంత గ్రాండ్‌గా నిర్వహించే పండుగ ఛత్ పండుగ. ఈ పండుగ అక్టోబర్ 25-28 తేదీల్లో జరుగుతుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం వెలుపల ఉన్న బీహారీయులంతా వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో బీహారీయులు తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్లకముందే ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ఈసీని కోరాయి. అంతేకాకుండా గతంలో మాదిరిగా మూడు విడతల్లో కాకుండా తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని.. ప్రచార భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశాయి. పార్టీల అభ్యర్థన మేరకు రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఈసీ భావిస్తోంది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ఎన్నికలు ముగించవచ్చని సమాచారం.

పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని జూబ్లీ హిల్స్, ఒడిస్సా లోని నౌపాడా, పంజాబ్‌లోని తరణ్ తరణ్, రాజస్థాన్‌లోని అంతా, జార్ఖండ్‌లోని ఘట్ సిలా, మిజోరాంలోని డంపా, జమ్మూ కాశ్మీర్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలు బడ్ గామ్, నగ్రోతాకు బైపోల్ షెడ్యూల్ విడుదల కానుంది

ఇక ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. అలాగే బూత్‌ల్లో 1,200 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని చెప్పింది. విజయవంతంగా అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ సర్వే పూర్తైందని పేర్కొంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఆలోపు కంటే ముందే ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.

Tags:    

Similar News