Rose Day : భర్తకు మద్యం అందిస్తూ రోజ్ డే వీడియో పోస్ట్ చేసిన మహిళ..ఎఫ్ఐఆర్ నమోదు

పిస్టల్‌తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో వివాదం

Update: 2026-02-13 04:30 GMT

సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం చేసే కొన్ని పనులు ఒక్కోసారి చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడతాయి. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. రోజ్ డే సందర్భంగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, పిస్టల్‌తో ఫొటో దిగి షేర్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.

ముంగేర్‌లోని కాశిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కంచన్ దేవి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలిగా సుపరిచితురాలు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫిబ్రవరి 7న రోజ్ డే సందర్భంగా, తన భర్త రాహుల్ కుమార్‌కు గులాబీ పువ్వు ఇచ్చి, ఆ తర్వాత మద్యం పోసి ఇస్తున్నట్లుగా ఉన్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. దీంతో పాటు, ఆమె పిస్టల్‌తో పోజిచ్చిన మరో ఫొటో కూడా వైరల్ అయింది.

బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడం, ఆయుధాన్ని బహిరంగంగా ప్రదర్శించడం వంటి అంశాలపై ముంగేర్ ఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం కంచన్ దేవి ఇంటిపై దాడి చేసి విచారణ చేపట్టింది. విచారణలో ఆమె ఫొటోలో ఉన్న పిస్టల్ దీన్‌దయాళ్ చౌక్‌కు చెందిన విశాల్ కుమార్‌ది అని, దానికి లైసెన్స్ ఉందని తేలింది.

అనధికార వ్యక్తికి ఆయుధాన్ని ఇచ్చి సోషల్ మీడియాలో ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కంచన్ దేవితో పాటు పిస్టల్ యజమాని విశాల్ కుమార్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Tags:    

Similar News