BIHAR:బీహార్ విద్యాశాఖలో జీన్స్, టీషర్ట్స్‌పై బ్యాన్
బీహార్ విద్యాశాఖలో జీన్స్, టీ-షర్టులు, క్యాజువల్స్ ధరించడంపై నిషేధం....తక్షణం అమల్లోకి ఆదేశాలు.. ఆఫీస్ కల్చర్ దెబ్బతింటోందని ఆవేదన..;
బీహార్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్కృతికి విరుద్ధంగా ఉన్న జీన్స్, టీ షర్టులు వంటి దుస్తులను ధరించవద్దని, వాటిపై నిషేధం విధించామని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఉద్యోగులు ఇష్టం వచ్చిన రీతిలో దుస్తులు ధరించి కార్యాలయాలకు వస్తున్నారని, దీని వల్ల ఆఫీస్ కల్చర్ దెబ్బ తింటోందని విద్యాశాఖ పేర్కొంది.
ఆఫీస్ కల్చర్‌కు విరుద్ధమైన వేషధారణలతో అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారని బీహార్ విద్యాశాఖ తెలిపింది. అధికారులు, ఉద్యోగులందరూ కార్యాలయాలకు ఫార్మల్ డ్రెస్‌లలో మాత్రమే రావాలని తేల్చి చెప్పింది. క్యాజువల్ డ్రెస్‌లు, జీన్స్, టీ-షర్టులు ధరించిన వారిని విద్యా శాఖ కార్యాలయాల్లోకి అనుమతించబోమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలపై బీహార్ విద్యా మంత్రి చంద్రశేఖర్‌ను మీడియా పదే పదే ప్రశ్నించినా ఆయన స్పందించలేదు.
గతంలోనూ బీహార్‌లోని సరన్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కార్యాలయాల్లో జీన్స్, టీ-షర్టులు ధరించకుండా నిషేధించారు. ఫార్మల్ డ్రెస్‌లు ధరించాలని, గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చారు. 2019లో ఉద్యోగుల ర్యాంక్‌లతో సంబంధం లేకుండా సచివాలయంలో జీన్స్, టీ-షర్టులు ధరించడాన్ని బీహార్ ప్రభుత్వం నిషేధించింది. సచివాలయ ఉద్యోగులు ఆఫీస్‌లో సాధారణ, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలని సూచించింది.