Chennai : రేసింగ్ ట్రాక్ పైనే యంగ్ రైడర్ మృతి
ఎమ్‌ఆర్‌ఎఫ్ ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో ఘటన;
యంగ్ బైక్ రైడర్ కొప్పారం శ్రియాస్ హరీశ్ దుర్మరణం పాలయ్యాడు. 13 సంవత్సరాల వయసుకే దేశంలోనే పేరున్న బైక్ యువరేసర్లలో ఒకడైన హరీశ్..చెన్నైలో జరుగుతున్న ఎమ్‌ఆర్‌ఎఫ్ ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చాలా చిన్నతనం నుంచి బైక్ రేసింగ్ లో పాల్గొంటూ వస్తున్న ఈ బెంగళూరు బుడతడు జాతీయస్థాయిలో డజనుకు పైగా టైటిల్స్ సాధించాడు. 250 సీసీ బైక్ తో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ గత రెండేళ్లుగా విజయ పరంపరలో కొనసాగడు. కానీ చివరకు అదే రేస్ ట్రాక్ లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ చాంపియన్షిప్ లో భాగంగా మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో జరిగిన రూకీ రేస్ లో పోల్ పొజిషన్ నుంచి మూడోరౌండ్ రేస్ ప్రారంభించిన హరీశ్ ఓ మలుపులో తలపై నుంచి హెల్మెట్ జారిపడిపోడంతో కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొనడంలో తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్సకోసం తరలిస్తున్న సమయంలోనే హరీశ్ ప్రాణాలు కోల్పోయాడు. హరీశ్ విషాదంతో నిర్వాహకులు మిగిలిన అన్ని రేస్ లనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
బెంగళూరులోని కెన్ శ్రీ స్కూలులో 8వ తరగతి చదువుతున్న కొప్పారం శ్రీయాస్ హరీశ్ కొద్దిరోజుల క్రితమే తన 13వ పుట్టినరోజును ఉత్సాహంగా జరుపుకొన్నాడు. ఎనిమిదేళ్ల వయసు నుంచే బైక్ రేసింగ్ లో పాల్గొంటూ వస్తున్న హరీశ్, 2021 లో స్పెయిన్ వేదికగా జరిగిన మినీ మోటీ జీపీలో పాల్గొని వచ్చాడు. వరుసగా నాలుగు జాతీయస్థాయి టైటిల్స్ సాధించడం ద్వారా హరీశ్ రికార్డుల మోత మోగించాడు. మలేసియా వేదికగా ఈ నెలలోనే జరిగే అంతర్జాతీయ బైక్ రేసింగ్ 250 సీసీ విభాగంలో హరీశ్ పాల్గొనాల్సి ఉంది.
ఇండియన్ మోటార్ బైక్ రేసింగ్ క్లబ్ నిబంధనల ప్రకారం 12 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే లైసెన్సులు జారీ చేస్తుంది. రేస్ ట్రాక్ ల్లో, కట్టుదిట్టమైన భద్రతా నిబంధనలతో, సరైన పర్యవేక్షణలో మాత్రమే వారు రేసింగ్ లో పాల్గొనటానికి ఈ లైసెన్స్ అనుమతి ఇస్తోంది. అలా అని ఇదే లైసెన్సుతో వారు సాధారణ రోడ్లపై బైక్ లు నడపడానికి అనుమతి ఉండదు.