గంటకు 150km వేగంతో దూసుకొస్తున్న.. బిపోర్‌జాయ్
భీకర బిపోర్‌జాయ్ తుఫాన్ ముంచుకొస్తోంది. గుజరాత్‌లోని జఖౌ వద్ద తుఫాన్ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.;
భీకర బిపోర్‌జాయ్ తుఫాన్ ముంచుకొస్తోంది. గుజరాత్‌లోని జఖౌ వద్ద తుఫాన్ తీరం దాటనుంది. గురువారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అటు గుజరాత్‌లోని కచ్, పోర్‌బందర్, దేవభూమి ద్వారక, జాంనగర్, జునాగఢ్, మోర్బి జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో కచ్ తీరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ అధికారులు.
అటే గడిచిన 25 ఏళ్లలో గుజరాత్‌లో తుఫాన్ రావడం ఇదే తొలిసారి అని అక్కడి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బిపోర్‌జాయ్ తుఫాన్ తరుముకొస్తున్న వేళ.. స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. సుమారు 7 వేల 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కచ్ జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌ను విధించారు. 15వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం.
బిపోర్‌జాయ్ తుఫాన్ పరిస్థితిపై ఢిల్లీలో ప్రధాని మోదీ సమీక్షించారు. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. అటు ముంబైకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీంతో ముందస్తుగా అక్కడ ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. బలమైన గాలుల కారణంగా ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.