BJP: గతానికి భిన్నంగా పావులు కదుపుతున్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపిక విషయంలో..
BJP: తెలంగాణలో కమల దళం వ్యూహం మార్చింది. గతానికి భిన్నంగా పావులు కదుపుతోంది.;
BJP: తెలంగాణలో కమల దళం వ్యూహం మార్చింది. గతానికి భిన్నంగా పావులు కదుపుతోంది.. పార్టీ బలోపేతంపై ఓ వైపు దృష్టి సారిస్తూనే మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై పోస్ట్ మార్టం నిర్వహించిన పార్టీ నాయకత్వం మొట్ట మొదటి లోపాన్ని సరిదిద్దుకునే పనిలో పడింది. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 105మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది..
ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి అభ్యర్థులు దొరక్క అవస్థలు పడాల్సి వచ్చింది.. అదీకాక ఇటీవల ప్రత్యర్థి రాజకీయ పక్షాలు బీజేపీకి అభ్యర్థులు లేరన్న ప్రచారాన్ని తెరమీదకు తెస్తున్నాయి. వీటిని తిప్పికొట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇచ్చే ఉద్దేశంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది.
ఇప్పటికే అసెంబ్లీ కన్వీనర్లను పార్టీ తరఫున నియమించుకున్నారు. అసెంబ్లీ కన్వీనర్లు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తులనే అసెంబ్లీ ఇన్చార్జులుగా నియమించాలని పార్టీ భావిస్తోంది.. దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్‌కు పంపిన నివేదికకు అమోద ముద్ర కూడా పడింది.
అయితే తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో మొదట 60 స్థానాలకు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచేందుకు ఇది దోహద పడుతుందని ఆలోచిస్తోంది. పోటీ లేకుండా ఒక్కరే అభ్యర్థి ఉన్న నియోజక వర్గాలను గుర్తించిన నాయకత్వం వారి పేర్లను అధికారికంగా ప్రకటించబోతోంది. తొలి జాబితాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుగా ఉన్న 31 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉన్నట్లు సమాచారం..
అయితే, మిగతా 30 నియోజకవర్గాలు ఏవన్న దానిపై పార్టీలో అన్న దానిపై పార్టీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.. మొదటి జాబితాలోనే తమ పేర్లుంటే తమ పని తాము చేసుకునేందుకు వీలవుతుందని ఆశావాహులు భావిస్తున్నారు. ప్రకటించిన 60 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపై రాష్ట్ర నాయకత్వం సంతృప్తి చెందకపోతే.. చివరి క్షణంలో కూడా అభ్యర్థులను మార్చుకునేందుకు అనువుగా అభ్యర్థులు అనకుండా ఇన్‌ఛార్జ్‌ల పేరు వాడుతోందని తెలుస్తోంది..
నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల జాబితాలో తమపేర్లు ఉంటే బాగుండు అనుకుంటున్న నేతలు.. కండీషన్స్ అప్లై అన్న రాష్ట్ర నాయకత్వం నిబంధనలతో ఉసూరుమంటున్నారు.. మొత్తంగా బీజేపీ తెలంగాణలో పక్కా ప్లాన్‌తోనే ముందుకెళ్తోంది.. అయితే, ఈ ముందస్తు ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుంది..? ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలదొక్కుకుని పార్టీ గెలుపునకు ఏమేరకు అవకాశాలు ఉంటాయో చూడాలి.