Odisha : ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మోహన్ మాఝీ..
నేడు సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎం ప్రమాణస్వీకారం..;
ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న కమలం పార్టీ గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. కియోంజర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రవతీ పరిడా, కేవీ సింగ్‌దేవ్‌లకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. మంగళవారం భువనేశ్వర్‌లో ఒడిశా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాఝీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ (బుధవారం) సాయంత్రం సీఎంగా మోహన్ చరణ్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేయబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వాన తొలి పత్రికను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథస్వామికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఇక, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌ను సైతం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు సైతం హాజరుకాబోతున్నారు. 147 సీట్లున్న ఒడిశాలో ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా అధికారం చేపట్టబోతుంది.
కాగా, ఒడిశా బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మోహన్ చరణ్ మాఝీ.. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా, అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్ స్థానం నుంచి ఆయన గెలిచారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 1997-2000 వరకు సర్పంచ్‌గా పని చేసిన ఆయన.. 2000వ సంవత్సరంలో తొలిసారి ఒడిశా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009, 2019తో పాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా మాఝూ ఎదిగారు.