Bjp Election Plan: గెలుపే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్రణాళికలు

50 శాతం ఓట్ల మార్క్‌ను చేరుకోవాలని వ్యూహాలు;

Update: 2024-04-07 02:15 GMT

లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలువడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. దేశ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకూ ఏ పార్టీ సాధించలేని 50 శాతం ఓట్ల మార్క్‌ను చేరుకోవాలని కమలదళం.. వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికల్లో భాజపా సొంతంగా గెలిచిన 303 స్థానా...230 స్థానాలను లక్షకుపైగా మెజారిటీతో చేజిక్కించుకుంది. ఈసారి 370 స్థానాలు గెలుచుకోవడంతోపాటు ఓట్ల శాతం కూడా భారీగా పెంచుకోవాలని కమలనాథులు గట్టి పట్టుదలతో ఉన్నారు. మోదీ ఛరిష్మాకుతోడు పదేళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకుప్రయత్నిస్తోంది. 370 స్థానాలు, 50 శాతం ఓట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు గతంలో కాస్త తేడాతో ఓడిన స్థానాలపై...కాషాయ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన 35 స్థానాల్లో గెలుపు కోసం కసరత్తు చేస్తోంది. 2014లో గెలిచి 2019 ఎన్నికల్లో భాజపా ఓడిన స్థానాల్లో ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 14 స్థానాలు ఉన్నాయి. బిహార్‌లో ఆరు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో రెండేసి స్థానాలు ఉన్నాయి. వాటిని కైవసం చేసుకునేందుకు ప్రాంతీయ పార్టీలతో... పొత్తుల వ్యూహానికి తెర తీసింది.

2014లో గెలిచి 2019 ఎన్నికల్లో భాజపా ఓడిన స్థానాల్లో కమలం పార్టీ బలమైన అభ్యర్థులను బరిలో దింపుతోంది. ఇప్పటికే కేవలం 2 నుంచి 3 శాతం ఓట్ల తేడాతో ఓడిన 73 స్థానాలనూ భారతీయ జనతా పార్టీ గుర్తించింది. మొత్తం 73 స్థానాల్లో లక్ష లోపు మెజారిటీ వచ్చిందని గుర్తించిన కమలం పార్టీ  36 స్థానాల్లో 50వేల నుంచి 97వేల మెజార్టీ సాధించగా మిగిలిన 37 స్థానాల్లో 50వేలలోపు మెజారిటీ మాత్రమే దక్కడంపై దృష్టి సారించింది. తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాల్లో తమ బలాన్ని మరింత పెంచుకుని చేజారకుండా చూడాలనిభాజపా భావిస్తోంది. లక్ష కంటే తక్కువ మెజార్టీ వచ్చిన స్థానాల్లో ఏ మాత్రం తప్పటడుగు వేసినానష్టపోయే అవకాశం ఉందన్న అంచనాలతో భాజపా నాయకత్వంఈ స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. అలాగే ప్రాంతీయ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుంది. జేడీఎస్‌, జేడీ(యూ), ఎల్జేపీ, పీఎంకే, ఆరెడ్డీ వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకుంది.

భారతీయ జనతా పార్టీ 370 స్థానాలు గెలుచుకోవాలంటేఇప్పుడున్న వాటిని నిలబెట్టుకోవడంతోపాటు కొత్త వాటిని గెలుచుకోవాల్సి ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 2019లో వీచిన నరేంద్ర మోదీ గాలితో..దేశవ్యాప్తంగా భాజపా అభ్యర్థులు లక్షల మెజారిటీతో గెలిచారు. మోదీ హవాలోనూ అత్తెసరు మెజారిటీతో బయటపడిన నేపథ్యంలో ఈసారి ఎంపికలో భాజపా పార్టీ ఆచితూచి వ్యవహరించింది. పైరవీలు, సీనియార్టీలను పక్కన పెట్టి గెలుపు అవకాశాలున్న వారికే టికెట్లిస్తోంది. ఇప్పటికే ఏకంగా 103 మందికి పైగా సిట్టింగులను తప్పించింది. వారిలో కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖీ, అశ్వినీకుమార్‌ చౌబే ఉన్నారు. వరుణ్‌గాంధీకి కూడా కమలం పార్టీ టికెట్లు ఇవ్వలేదు. అనంత్‌కుమార్‌ హెగ్డే, సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వంటి వివాదాస్పదులకూ మొండిచేయి చూపారు. 2019 ఎన్నికల్లో 50వేల నుంచి లక్ష వరకు మెజారిటీతో గెలిచిన 36 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 13 మందిని భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం మార్చింది. 5వేల లోపుమెజారిటీతో గట్టెక్కిన 37 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో మరో 13 మందిని మార్చారు. లక్షలోపు మెజారిటీతో గట్టెక్కిన 73 మందిలో 35 శాతం మందిని పార్టీ పక్కనబెట్టింది. ఇందులో ఇంకా 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Tags:    

Similar News