Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిజేపి
ఫిబ్రవరి నెలంతా బిజీ, బిజీ గా నేతలు;
లోక్‌సభ ఎన్నికలకు భాజపా పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. ఫిబ్రవరి నెలంతా తీరిక లేకుండా ఉండేలా కార్యక్రమాలు రూపొందించింది. చేరికలతోపాటు.. బస్సుయాత్రలతో ఊపుతీసుకురావాలని వ్యూహాలు రచించింది. భారాస, కాంగ్రెస్‌లోని అసంతృప్తనేతలని పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. గ్రామీణస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు చేర్చుకోవాలని.. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు.
అసెంబ్లీఎన్నికల్లో జరిగిన లోపాలు సరిచేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర భాజపా నిర్ణయించింది. క్యాడర్ బలోపేతంచేయాలంటే గ్రామస్థాయిలో నిత్యం కొత్తగా చేరికలను ప్రోత్సహించాలని నాయకులు, కార్యకర్తలను ఆదేశించింది.ఇతర పార్టీల నుంచి వచ్చేవారే కాకుండా సామాజిక సేవ చేసే వారికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల మొత్తం చేరికలకి కేటాయించాలని అంతా ఆ విషయంపై దృష్టిసారించాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేపట్టనుంది. 17 లోక్ సభ స్థానాలను... 5 క్లస్టర్లుగా విభజించింది. ఈ నెల 10 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలు చేపట్టనుంది. అందుకు సంబంధించిన నిర్వహణ, రూట్‌మ్యాప్‌పై పదాధికారుల సమావేశంలో చర్చించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 4, 5, 6న పార్లమెంట్ నియోజకవర్గ ప్రవాస్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈనెల 18 నుంచి 24 వరకు నారీశక్తి వందన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 27, 28, 29న కేంద్రప్రభుత్వ లబ్ధిదారులతో సమావేశమయ్యేలా కార్యక్రమాలు చేపట్టనుంది. ఆ కార్యక్రమానికి లాభార్థీ సంపర్క్‌యోజనగా పేరుపెట్టింది. ఈనెల14న పార్లమెంట్ ఎన్నికలకార్యాలయాలుప్రారంభించాలని రాష్ట్ర నాయకత్వం నాయకులను ఆదేశించింది. ఫిబ్రవరి 29లోపు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించాలని స్పష్టం చేసింది. మార్చి5 నుంచి 10వ వరకు కొత్త ఓటర్ల సంపర్క్ అభియాన్ చేపట్టనుంది.
రాష్ట్రప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరపడం లేదని.. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. భారాస మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ గెలిచిందన్న ఆమె ఆవిషయం తెలిసే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించట్లేదని ఆరోపించారు. 17 ఎంపీలని గెలిపిస్తేనేగ్యారంటీలు అమలవుతాయని కాంగ్రెస్ చెబుతోందని.. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి పార్లమెంట్ ఎన్నికలకు ముడి పెట్టడం ఏంటని డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆరు గ్యారెంటీలు కాదు మోదీ గ్యారెంటీతోనే భవిష్యత్ ఉంటుందనే నినాదంతో భాజపా ప్రజల్లోకి వెళ్లనుంది.