ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతాపార్టీ అంతర్గత విభేదాలతో సతమతం అవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఆ పార్టీలో ఆధిపత్య పోరును బట్టబయలు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య భేదాభిప్రాయాలు పార్టీ ప్రతిష్టను రోడ్డునపడేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం యూపీ భాజపా చీఫ్ భూపేందర్ చౌదరి.. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించారు.
లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వివరించే నివేదికను హైకమాండ్ కు అందజేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ కు సంబంధించి వివాదాస్పద అగ్నిపర్ స్కీమ్, పేపర్ లీకేజీ సంఘటనలు, పాత పెన్షన్ సహా మొత్తం ఆరు అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపాయని 15 పేజీల నివేదికలో చౌదరి తెలిపారు. యూపీ వ్యాప్తంగా 80 లోక్ సభ నియోజకవర్గాలలో 40 వేల మంది పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు.
రాజ్ పుత్ వర్గంలో అసంతృప్తి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య ధోరణికి తోడు దాదాపు అన్ని నియోజకవర్గాలలో 30 వేల నుంచి 40 వేల మంది భాజపా ఓటర్ల పేర్లను తొలగించినట్లు కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ అంశాలన్నిటిపైనా హైకమాండ్ సుదీర్ఘంగా చర్చించింది. త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికలపై దృష్టిసారించింది. అన్నిస్థానాలను గెలిచి తీరాలని రాష్ట్ర ముఖ్యనేతలకు అగ్రనాయకత్వం అల్టిమేటం జారీ చేసింది.