Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా , మూజువాణి ఓటుతో ఎన్నిక

ఇక డిప్యూటీ స్పీకర్ పదవిపై విపక్షాల ఆశలు;

Update: 2024-06-27 00:00 GMT

నూతన లోక్‌సభ స్పీకర్‌ గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్‌పై ఆయన విజయం సాధించారు. సభలో చేపట్టిన మూజువాణి ఓటింగ్‌ అనంతరం ఓం బిర్లా గెలిచినట్టు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. దీంతో గత టర్మ్‌లో కూడా స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం బిర్లా వరుసగా రెండోసారి ఆ పదవిని చేపట్టారు. రెండోసారి స్పీకర్‌ అయిన వాళ్లలో ఓం బిర్లా ఐదో వ్యక్తి. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఇతర ఎంపీలు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత మోదీ, రాహుల్‌ వెంట రాగా.. ఓం బిర్లా స్పీకర్‌ కుర్చీలో ఆసీనులయ్యారు.

ఈ సందర్భంగా మోదీతో రాహుల్‌ కరచాలనం చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ గత టర్మ్‌లో సభ కార్యకలాపాలను నిర్వహించడంలో ఓం బిర్లా సమతుల్యత పాటించారని, చాలా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారని ప్రశంసించారు. పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన పని కొత్త ఎంపీలకు స్ఫూర్తి అన్నారు. రాహుల్‌, అఖిలేశ్‌ యాదవ్‌ సహా పలువురు విపక్ష ఎంపీలు మాట్లాడుతూ స్పీకర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు అవకాశాలు ఇవ్వాలన్నారు. ఎంపీల సస్పెన్షన్లు మరోసారి జరుగకూడదని పలువురు విపక్ష ఎంపీలు పేర్కొన్నారు. విపక్షం గొంతును అణచివేసి, సభను నడపటం అనేది ఒక అప్రజాస్వామిక ఆలోచన అని రాహుల్‌ బీజేపీ ప్రభుత్వానికి కౌంటర్‌ ఇచ్చారు.

దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటముల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోటీ అనివార్యమైన విషయం తెలిసిందే. ఎన్డీయే తరపున ఓంబిర్లా మంగళవారం నామినేషన్‌ వేయగా.. విపక్ష ఇండియా నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కే సురేశ్‌ పోటీలో నిలబడ్డారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలన్న విపక్షాల కండీషన్‌కు అధికార పక్షం అంగీకరించకపోవడంతో దాదాపు గత 50 ఏండ్లలో తొలిసారి, స్వతంత్ర భారతంలో మూడోసారి స్పీకర్‌ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదివి దక్కలేదు కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోవాలని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే లోక్‌సభ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటే డిప్యూటీ స్పీకర్ స్పీకర్ విధులను నిర్వహిస్తారు. సభకు అధ్యక్షత వహిస్తున్నప్పుడు, డిప్యూటీ స్పీకర్‌కు స్పీకర్‌కు ఉన్న సాధారణ అధికారాలు ఉంటాయి. రూల్స్‌లోని ‘స్పీకర్’ సూచనలన్నీ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన ప్రస్తుతానికి సంబంధించిన సూచనలుగా పరిగణించాలి.

Tags:    

Similar News