India Pak War : ఉద్రిక్తతల వేళ సెల్‌ఫోన్ల వెలుగులో ఏడడుగులు!
చీకట్లో సాగిన శుభముహూర్తం;
దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సాధారణ జనజీవనంపై ఊహించని ప్రభావం చూపుతాయి. అలాంటి ఓ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దు జిల్లాల్లో గురువారం రాత్రిపూట విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. వైమానిక దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో జోధ్‌పూర్‌లోని పావ్టా ప్రాంతంలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. కీలకమైన సప్తపది ఘట్టం ఆరంభమయ్యే సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా అంధకారంలోకి జారుకుంది.
ఈ ఊహించని పరిణామంతో పెళ్లి మండపంలో కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, పెళ్లికి హాజరైన అతిథులు వెంటనే తేరుకున్నారు. తమ వద్దనున్న సెల్‌ఫోన్ లైట్లను ఆన్‌చేసి, ఆ వెలుగులోనే వధూవరులతో ఏడడుగులు నడిపించారు. అనంతరం, పురోహితుడు అదే మొబైల్ కాంతుల మధ్య మంత్రోచ్ఛారణ చేస్తూ మిగిలిన వివాహ క్రతువులను పూర్తి చేయించారు.
ఈ సందర్భంగా వరుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పెళ్లి తంతు కంటే దేశ భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం పాటిస్తూ, అధికారుల సూచనలకు అనుగుణంగా వివాహాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఘటన దేశభద్రత పట్ల పౌరులకున్న బాధ్యతను, సహకారాన్ని తెలియజేస్తోంది.