BMC Elections: ముంబై పాలిటిక్స్‌లో 12 మంది జెన్-జెడ్ కార్పొరేటర్లు

అత్యంత పిన్న వయస్కుడు బీజేపీ నుంచి గెలిచిన కాశీష్ పుల్వారియా

Update: 2026-01-27 02:12 GMT

ఆసియాలోనే అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన ముంబై బీఎంసీ ఎన్నికలు.. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఎన్నికలు ముగిసినా మేయర్ ఎన్నిక పెండింగ్‌లో ఉండటంతో అందరి దృష్టి ఇప్పుడు ముంబై మేయర్ ఎవరు అనే దానిపై పడింది. మేయర్ సీటును జనరల్ మహిళకు కేటాయించారు. అయితే ఈ బీఎంసీ ఎన్నికల్లో 12 మంది యువ జెన్‌జీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచి సంచలనం సృష్టించారు. బీజేపీకి చెందిన 22 ఏళ్ల కశీష్ ఫుల్వారియా అతి పిన్న వయస్కురాలైన కార్పొరేటర్‌గా రికార్డు నెలకొల్పారు.

89 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవగా.. త్వరలో ముంబైకి జనరల్ కేటగిరీ నుంచి మహిళా మేయర్ పీఠం దక్కనుంది. యువ రక్తం రాకతో ముంబై పాలనలో కొత్త మార్పులు రానున్నాయి. మరోవైపు.. ముంబై మున్సిపల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన కార్పొరేటర్‌గా 22 ఏళ్ల కశీష్ ఫుల్వారియా రికార్డు సృష్టించారు. బీజేపీ తరపున వార్డు నంబర్ 151 (చెంబూరు/కుర్లా) నుంచి పోటీ చేసిన కశీష్ ఫుల్వారియా.. తన సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. మాజీ కార్పొరేటర్ రాజేష్ ఫుల్వారియా కుమార్తె అయిన కశీష్ ఫుల్వారియా.. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి.. టెక్నాలజీ సాయంతో వార్డు సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఈసారి గెలిచిన యువ కార్పొరేటర్లలో కేవలం రాజకీయ వారసులే కాకుండా.. ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం విశేషం. వీరిలో హోమియోపతి డాక్టర్ సమన్ అజ్మీ (29), జ్యువెలరీ డిజైనర్ దిశా యాదవ్ (29), ఎంబీఏ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తం 227 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 65, ఏకనాథ్ షిండే శివసేన 29 స్థానాలను దక్కించుకున్నాయి.

ముంబైకి మహిళా మేయర్

ఇటీవల నిర్వహించిన రిజర్వేషన్ లాటరీ ప్రకారం.. ఈసారి ముంబైకి జనరల్ కేటగిరీ మహిళ నుంచి మేయర్ ఎంపిక కానున్నారు. మెజారిటీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ-షిండే కూటమి నుంచి ఒక మహిళా నేత ముంబై మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఫిబ్రవరిలో జరగనున్న మేయర్ ఎన్నికల కోసం అప్పుడే ముంబైలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి.

తమ కార్పొరేటర్‌‌కే మేయర్ పదవి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తుండగా.. గత కొన్ని దశాబ్దాలుగా ముంబై మేయర్ పీఠం శివసేనకే ఉందని.. అందుకే ఆ అవకాశం తమకే ఇవ్వాలని.. అప్పుడే తమది నిజమైన శివసేన అని అంతా భావిస్తారని షిండే శివసేన వర్గం పట్టుబడుతోంది. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇంకా ఉత్కంఠగానే మారింది.

Tags:    

Similar News