Narendra Modi: గణతంత్ర దినోత్సవ పరేడ్ జాతీయ గర్వానికి నిదర్శనమన్న ప్రధాని మోదీ

వేడుకల అనంతరం సంప్రదాయాన్ని పక్కనపెట్టి కర్తవ్యపథ్‌లో నడిచిన ప్రధాని

Update: 2026-01-26 09:30 GMT

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశరాజధాని ఢిల్లీలో అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన అద్భుతమైన పరేడ్ ముగిసిన అనంతరం, ఈ వేడుకలు "దేశ ప్రతిష్ఠకు శక్తిమంతమైన ప్రతీక" అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం ఆయన సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వేడుకల ద్వారా భారతదేశ ప్రజాస్వామ్య బలం, సాంస్కృతిక వారసత్వ సంపద, దేశాన్ని ఏకతాటిపై నిలిపే ఐక్యత ప్రదర్శితమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంతో, గర్వంతో జరుపుకుందని ప్రధాని తెలిపారు. "గణతంత్ర దినోత్సవ పరేడ్, భారతదేశ అద్భుతమైన భద్రతా వ్యవస్థను ప్రదర్శించింది. ఇది మన దేశ సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యం, పౌరులను రక్షించడంలో మనకున్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని మోదీ మరో పోస్ట్‌లో వివరించారు. మన భద్రతా దళాలు నిజంగా దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.

పరేడ్ ప్రారంభానికి ముందు, ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో గణతంత్ర వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ పరేడ్‌లో భారత సైన్యం తొలిసారిగా 'బ్యాటిల్ అర్రే' ఫార్మాట్‌లో తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించింది. స్వదేశీ ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలతో పాటు, వివిధ రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కర్తవ్యపథ్‌లో కనువిందు చేశాయి.

ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని మోదీ పరేడ్ ముగిశాక ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి కర్తవ్యపథ్‌లో నడిచారు. ఆయన చాలా దూరం నడుస్తూ, ఇరువైపులా ఉన్న ప్రేక్షకులకు అభివాదం చేశారు. ప్రధానిని చూసిన ప్రజలు 'భారత్ మాతా కీ జై', 'మోదీ-మోదీ' నినాదాలతో హోరెత్తించారు. చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని, ఉత్సాహంగా ఆయనకు స్వాగతం పలికారు. చిన్నారులు కుర్చీలపైకి ఎక్కి మరీ ప్రధానిని చూసేందుకు ఆసక్తి చూపారు.

కొంత దూరం నడిచిన తర్వాత, ప్రధాని తన వాహనంలోకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాజస్థానీ సంప్రదాయ తలపాగా, నెమలి ఈకల అలంకరణతో మోదీ తన ప్రత్యేకమైన వస్త్రధారణతో మరోసారి ఆకట్టుకున్నారు.

Tags:    

Similar News