Bomb Threat : ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపులు

రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా బెదిరింపులు

Update: 2025-10-17 05:15 GMT

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కొన్ని రోజులుగా ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌  నివాసమే లక్ష్యంగా ఈ బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.

శుక్రవారం చెన్నైలోని ఉప రాష్ట్రపతి నివాసంలో బాంబు అమర్చినట్లు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఆయన ఇంటికి చేరుకొని తనిఖీలు చేయగా.. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. దీంతో ఇది బూటకపు బెదిరింపుగా నిర్ధరించారు. ఇక, ఈ మెయిల్‌ పంపిన వారిని పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

పరీక్ష ఎగ్గొట్టేందుకు ఓ విద్యార్థి ఏకంగా పాఠశాలలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. గురువారం విశాల్‌ భారతి పబ్లిక్‌ స్కూల్‌కు ఈ-మెయిల్‌ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేయగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో ఇది బూటకమైనదిగా పేర్కొన్నారు. మెయిల్‌ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేయగా.. బెదిరింపులకు పాల్పడింది ఆ పాఠశాల్లోని విద్యార్థి అని తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. పరీక్షలకు భయపడే తాను ఇలా చేశానని విద్యార్థి అంగీకరించాడు. దీంతో పోలీసులు బాలుడిని మందలించి ఇంటికి పంపించేశారు. 

Tags:    

Similar News