Brij Bhushan: బ్రిజ్ భూషన్‌పై బిజెపి వేటు, కొడుక్కి చోటు
చర్చనీయాంశమైన కుటుంబ వారసత్వం;
భాజపా బాహుబలి నేత, లైంగిక ఆరోపణల ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ చరణ్‌సింగ్‌పై పార్టీ వేటు వేసింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ బ్రిజ్ భూషణ్‌కు భాజపా టికెట్ నిరాకరించింది. అదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం టికెట్‌ను ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కే భాజపా కేటాయించడం గమనార్హం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు సీనియర్ నేతలను సైతం ఈసారి ఎన్నికల్లో పక్కకు బెట్టిన భాజపా.. బ్రిజ్‌భూషణ్ విషయానికి వచ్చే సరికి అతడి కుమారుడికే టికెట్ ఇవ్వడం. చర్చనీయాంశం అవుతోంది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్ చరణ్‌సింగ్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. దేశవ్యాప్తంగా రెజ్లర్ల నిరసనల ఘటన తీవ్ర దుమారం రేపడంతో జాగ్రత్తపడిన భాజపా.. ఈసారి ఆయనకు కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గ టికెట్ నిరాకరించింది. అయితే టికెట్‌ను చివరకు ఆయన కుమారుడు కరణ్‌భూషణ్ సింగ్‌కే కేటాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కైసర్‌గంజ్ అభ్యర్థిపై ఇన్నాళ్లూ కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. అదే సమయంలో కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీ అభ్యర్థిగా ప్రతాప్‌సింగ్‌ను భాజపా బరిలో నిలిపింది.
ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ అందులో 3 సార్లు కైసర్‌గంజ్‌కే ప్రాతినిథ్యం వహించారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీ సాధించిన బ్రిజ్‌భూషణ్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బడా నేతల్లో ఒకరు. అనేక కేసులు ఉన్నా రకరకాల రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నారు. భారీ ఎత్తున విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించారు. యూపీలోని అరడజను జిల్లాలో బ్రిజ్‌భూషణ్ హవా కనపడుతుంది. కైసర్‌గంజ్‌తో పాటు చుట్టుపక్కల అనేక నియోజకవర్గాల్లో రాజకీయాలను బ్రిజ్‌భూషణ్ ప్రభావితం చేయగలడని సమాచారం.బ్రిజ్‌భూషణ్ చిన్న కుమారుడైన కరణ్ భూషణ్ సింగ్ ప్రస్తుతం యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. గోండాలోని కో-ఆపరేటివ్ విలేజ్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్ మరో కుమారుడు ప్రతీక్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
రమేష్ బిదూరి, సాధ్వీ ప్రగ్యాఠాకూర్, పర్వేశ్ వర్మ, మీనాక్షి లేఖి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి కీలక నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ భాజపా టికెట్ నిరాకరించింది. అయితే బ్రిజ్ భూషణ్ విషయంలో మాత్రం ఆయన కుమారుడికే టికెట్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది