India Vs Canada: ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా..
భద్రత కోసమే వీసాలు బంద్.. భారత్ తీవ్ర విమర్శలు;
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామంగా మారింది. రాజకీయ లబ్ధి కోసం భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ముష్కర మూకలకు ఆ దేశం ఊతమిస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై అమెరికా చర్యలు తీసుకుంటే సంబరపడుతున్న కెనడా అదే సమయంలో తమ దేశంలో వేర్పాటువాదులను పెంచి పోషిస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. భారత్‌కు చెందిన దౌత్య కార్యాలయాలు, దేవాలయాలు, పౌరులపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. కెనడా తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్రవాదులకు, ఉగ్ర కార్యకలాపాలకు పొరుగుదేశం పాకిస్తాన్ అడ్డా ఉంటే కెనడా కూడా అదే బాటలో పయనిస్తోంది. వేర్పాటువాదాన్ని ఉసిగొల్పుతోన్న కొన్ని సంస్థలకుభావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కెనడా ఊతమిస్తోంది. భారత దౌత్య కార్యాలయాలు, పౌరులు, దేవాలయాలపై వేర్పాటువాద సంస్థలు దాడులకు తెగబడుతున్నా ఆ దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను కెనడాకు భారత్ ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నా ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వరల్డ్ సిఖ్ ఆర్గనైజేషన్, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్, సిఖ్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ వంటి ఖలిస్థానీ సానుభూతి సంస్థలు పాకిస్థాన్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్లు..ఖలిస్తానీ వేర్పాటువాదులతో భేటీ అయ్యినట్లు కూడా వార్తలు వచ్చాయి. భారత్ ప్రకటించిన అనేక మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కెనడాలోనే తలదాచుకుంటున్నారు. వీరంతా ఎన్నో హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కెనడాలో దాదాపు 20 మందికి పైగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. వారిని అక్కడ నుంచి బహిష్కరించడం, అప్పగించడంపై భారత్ అనేకసార్లు దౌత్యపరంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కెనడా అధికారుల నుంచి మాత్రం స్పందన కరవైంది.
వీటికి సంబంధించి అనేక పత్రాలు అందించినా ఫలితం శూన్యం. ఉగ్ర సంస్థలకు కెనడా మద్దతుగా నిలవడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 1990లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన గుర్వంత్ సింగ్‌తోపాటు ఇతర ఉగ్రవాదులను బహిష్కరించాలని భారత్ చేసిన వినతులు కెనడా అధికారుల వద్ద ఏళ్లుగా పెండింగులో ఉన్నాయి. గుర్వంత్‌పై ఉన్న ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా పెండింగులోనే ఉంది. కెనడాలో ఆయన అడ్రస్ చెప్పినా చర్యలు తీసుకోకపోవడం అక్కడి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇటీవల హత్యకు గురైన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో పంజాబ్ సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్.. 2018లో జస్టిన్ ట్రూడోకు విజ్ఞప్తి చేశారు. వాటినీ ఆ దేశ పెడ చెవిన పెట్టింది. భారత్‌లో లక్షిత దాడులు, వేర్పాటువాదులకు ఆజ్యం పోయడం, హత్యా బెదిరింపులకు పాల్పడటం వంటివాటిని కెనడాలో ఉన్న వేర్పాటువాద సంస్థలు బహిరంగంగా చేస్తున్నప్పటికీ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.