Cauvery Water Dispute: ముదురుతున్న కావేరీ జల వివాదం

కావేరి ప్రాధికారలో కర్ణాటకకు మళ్లీ చుక్కెదురు

Update: 2023-09-27 04:00 GMT

 కావేరి జలాల నిర్వహణా ప్రాధికారలో కర్ణాటకకు మళ్లీ చుక్కెదురైంది. అక్టోబరు 15 వరకు రోజుకు 3వేల క్యూసెక్కుల చొప్పున బిలిగొండ్లు రిజర్వాయర్‌ ద్వారా తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలని ప్రాధికార ఆదేశించింది. కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని మొత్తం 4 రిజర్వాయర్లలోనూ నీటిమట్టం చాలా తక్కువగా ఉందని ఢిల్లీలో మంగళవారం జరిగిన ప్రాధికార సమావేశంలో కర్ణాటక ఎంతగా వాదించినా లాభం లేక పోయింది. ఈ స్థితిలో రిజర్వాయర్ల నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేసే పరిస్థితిలో లేమని అధికారులు తమ నిస్సహాయతను ప్రాధికార ముందు వ్యక్తం చేశారు. తమిళనాడు జలవనరుల శాఖ అధికారుల వాదనను కూడా ఆలకించిన ప్రాధికార.. తమిళనాడుకు అక్టోబరు 15 వరకు కావేరి జలాలను విడుదల చేయాల్సిందేనని తేల్చిచెప్పింది.

కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాట నిరసనలు హోరెత్తుతున్నాయి. నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తమిళననాడులోని పలు ప్రాంతాల్లో రైతులు వినూత్న రీతిలో నిరసలు తెలుపుతున్నారు. తిరుచ్చిలో రైతులు చనిపోయిన ఎలుకలను నోటి దగ్గర పెట్టుకొని నీరు వదలకపోతే పంటలు ఎండిపోతాయని, అప్పుడు ఎలుకలే తినాల్సి వస్తుందని వాపోయారు.  కావేరి జల నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం కర్ణాటక ప్రభుత్వం 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. తమిళనాడు మాత్రం..12 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. 


కావేరీ నది నుంచి నీటి పంపకాలపై తమిళనాడు, కర్ణాటకల మధ్య కొనసాగుతున్న టగ్ ఆఫ్ వార్.. మ‌రింత‌గా ముదురుతోంది. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజూ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు చెబుతున్న ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం గతంలో రాష్ట్రంలో నిరసనలకు దారితీసింది. కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిటీ ఉత్తర్వులు (కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ సమర్థించాయి) కర్ణాటకలో నిరసనలకు దారితీశాయి. అక్కడ రైతు, కన్నడ అనుకూల సంఘాలు, కార్మిక సంఘాలు 96 గంటల్లో రెండు బంద్‌లకు పిలుపునిచ్చాయి. నిన్న  బెంగ‌ళూరులో బంద్ జరుగగా , శుక్ర‌వారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొన‌సాగింది. కన్నడ అనుకూల ఆందోళనకారులు నినాదాలు చేస్తూ, దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న దృశ్యాలు ఈ పోరాటం వెనుక ఉన్న భావోద్వేగాలను నొక్కిచెబుతున్నాయి. మైసూరు, మండ్యతో పాటు బెంగళూరులో కూడా రైతు సంఘాలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నీటిని విడుదల చేయడానికి నిరాకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. 


తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయొద్దని, కరువు కాలంలో పరిస్థితులను అంచనా వేయడానికి ఈసీ వంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని, మేకదాతు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. సుమారు 1000 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   


Tags:    

Similar News