Gaming zone: గేమింగ్ జోన్ ప్రమాద తీవ్రతకు కారణం ఏంటంటే?
ఫైబర్‌డోమ్ వెల్డింగ్ పనుల వల్లే ప్రమాదం!!;
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో శనివారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 35కు పెరిగింది. వీరిలో 12 మంది చిన్నారులున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ప్రమాదంలో.. అన్నీ కన్నీళ్లు తెప్పించే మానవీయ కోణాలే.ఏ బాధిత కుటుంబాన్ని కదిలించినా.. కన్నీటి కథలే..!
అయితే గేమింగ్ జోన్‌లోని గో-కార్ట్‌లో ఉన్న టైర్లు, కలప నిర్మాణాలు, ఫ్లెక్సీలతోపాటు.. భారీగా ఉన్న పెట్రో నిల్వలు కూడా మంటలు క్షణాల్లో వ్యాపించడానికి దోహదపడ్డాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. జనరేటర్ల కోసం 1,500 లీటర్ల మేర డీజిల్, గో-కార్ట్ వాహనాల కోసం మరో 2 వేల లీటర్ల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, వాటివల్లే ప్రమాద తీవ్రవ పెరిగిందని వివరిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని భావిస్తున్నా..ఆ సమయంలో ఫైబర్‌డోమ్ వద్ద వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని, నిప్పురవ్వల కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. గేమింగ్ జోన్‌లోని బౌలింగ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు దీనికి సంబంధించి పిటిఐ 40 సెకన్ల నిడివి గల వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో మంటలు చెలరేగిన ప్రదేశంలో చాలా మండే పదార్థాలు ఉంచినట్లు చూడవచ్చు. మంటల్లోంచి ఆ వస్తువులను తీయడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగడంతో చాలా మంది ప్రజలు పరుగులు తీస్తున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. అయితే కొద్దిసేపటికే మంటలు భారీ రూపం దాల్చాయి.
‘గేమ్ జోన్’లో జరిగిన అగ్నిప్రమాద ఘటనను గుజరాత్ హైకోర్టు స్వయంగా స్వీకరించింది. దీనిని ప్రాథమికంగా ‘మానవ నిర్మిత విపత్తు’గా పేర్కొంది. పెట్రోలు, ఫైబర్, ఫైబర్ గ్లాస్ షీట్లు వంటి అత్యంత మండే పదార్థాలను ‘గేమ్ జోన్’లో ఉంచినట్లు బెంచ్ తెలిపింది ‘గేమ్ జోన్’లో అగ్నిప్రమాదానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) కూడా లేదని విచారణలో తేలింది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అగ్నిమాపక భద్రతా పరికరాలు ఉన్నాయని, అయితే మంటలను అదుపు చేసేందుకు తీసుకున్న చర్యలు సరిపోకపోవడంతో శనివారం విషాదం చోటుచేసుకుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. TRP గేమ్ జోన్‌ను నిర్వహిస్తున్న రేస్‌వే ఎంటర్‌ప్రైజెస్ భాగస్వామి యువరాజ్ సింగ్ సోలంకి మరియు దాని మేనేజర్ నితిన్ జైన్‌లను అరెస్టు చేసినట్లు రాజ్‌కోట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) పార్థరాజ్‌సింగ్ గోహిల్ తెలిపారు.