Champai Soren : బీజేపీలోకి మాజీ సీఎం చంపాయ్ సోరెన్..!
జార్ఖండ్‌లో బిగ్ ట్విస్ట్..;
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంపాయ్‌తోపాటు పలువురు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంపాయ్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ రోజే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో చంపాయ్ బీజేపీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది.
చంపాయ్ సోరెన్ ఇవాళ తన అధికారిక ఎక్స్ ప్రొఫైల్ నుంచి జేఎంఎంను తొలగించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇటీవల మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. దాంతో హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేసి, చంపాయ్ సోరెన్‌ను సీఎంగా నియమించారు. జూన్ 28న బెయిల్‌పై జైలు నుంచి వచ్చిన హేమంత్ సోరెన్.. చంపాయ్ నుంచి మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
అప్పటి నుంచి జేఎంఎం పార్టీకి చంపాయ్ సోరెన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఆయన ఏకంగా ఢిల్లీకి వెళ్లడం, తన ఎక్స్ ఖాతా నుంచి జేఎంఎంను తొలగించడం ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
అయితే ఢిల్లీకి చేరుకున్న చంపై సోరెన్‌ను బీజేపీ నేత సువేందు అధికారిని కలిశారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఎవరినీ కలవలేదు. వ్యక్తిగత పని కోసం ఇక్కడకు వచ్చాను’ అని అన్నారు.