Isro Ex-Cheef : లో బడ్జెట్ ప్రయోగాలు మంచివే కానీ..
అంతరిక్ష ఆశయాలు గగన్‌యాన్ మిషన్ తోనే సాధ్యం అన్న ఇస్రోమాజీ చీఫ్ శివన్;
అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూసుకెళ్తున్నప్పటికీ దీర్ఘకాలంలో పొదుపు మంత్రం పనిచేయదని శాస్త్రవేత్తలు అంటున్నారు. భవిష్యత్తులో భారీ రాకెట్లు అవసరమని సూచిస్తున్నారు. భారత్‌కు భారీ సామర్థ్యం కలిగిన రాకెట్లతోపాటు పెద్దవ్యవస్థలు అవసరమని పేర్కొంటున్నారు. మనిషిని తొలిసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్‌యాన్ మిషన్‌తో భారత అంతరిక్ష ఆశయాలు మరింత ఊపందుకుంటాయని ఇస్రోమాజీ చీఫ్ శివన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతరిక్ష పరిశోధనల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్....తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలను చేపడుతూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ వ్యయంతోనే అంగారక మిషన్ చేపట్టి సత్తా చాటింది. అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో దూసుకెళ్తున్నా....భవిష్యత్తులో భారీ రాకెట్లు అవసరమని ఇస్రో మాజీ ఛైర్మన్‌శివన్ అభిప్రాయపడ్డారు. జాబిల్లిపై దిగేందుకు చంద్రయాన్-3 సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌కు భారీ సామర్థ్యం కలిగిన రాకెట్లతోపాటు పెద్దవ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. కేవలం పొదుపు ఇంజినీరింగ్‌తో మనుగడ సాధించలేమని, అత్యాధునిక సాంకేతికతతోపాటు అత్యంత శక్తిమంతమైన రాకెట్లు కూడా అవసరమన్నారు. ఆ దిశగా అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇస్తూ....ప్రభుత్వం ఇటీవల ఓ మంచి పనిచేసినట్లు శివన్ తెలిపారు. ఇప్పటికే ప్రైవేటు రంగం ఆసక్తి చూపుతోందని. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. త్వరలోనే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నట్లు శివన్ తెలిపారు.
తొలిసారి మనిషిని అంతరిక్షంలోకి తీసుకెళ్లే ‘గగన్‌యాన్ మిషన్‌తో భారత అంతరిక్ష ఆశయాలు మరింత ఊపందుకుంటాయని ఇస్రో మాజీ చీఫ్ శివన్ పేర్కొన్నారు. ఈ సాంకేతికత నిరూపితమైన తర్వాత.... స్పేస్ స్టేషన్ నిర్మాణం, చంద్రుడిపై శాశ్వత ఆవాసం, ఇతర అంశాల గురించి ఆలోచించవచ్చన్నారు. భారత్ ఇప్పటికే అత్యంత శక్తిమంతమైన క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేసిందని....అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. స్పేస్ ఎక్స్ మాదిరిగా పునర్వినియోగ రాకెట్లపై భారత్ ప్రయత్నాలు చేస్తుందా. అన్న ప్రశ్నకు శివన్ బదులిచ్చారు. ప్రస్తుతం నిట్టనిలువుగా ల్యాండింగయ్యే ప్రక్రియపై ప్రయోగాలు జరుగుతున్నట్లు చెప్పారు.