Airport Check-in: దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో చెక్ ఇన్ సమస్య..
ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల అవస్థలు
మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సమస్య వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంటోంది. ప్రయాణికుల చెక్ ఇన్ వ్యవస్థ మొరాయించడంతో విమానాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో దేశంలోని పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీంతో శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విండోస్ సేవల్లో అంతరాయం వల్లే..
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలిగిందని నిపుణులు తెలిపారు. దీంతో ఎయిర్‌పోర్టుల వద్ద ఐటీ సర్వీసులు, చెక్ ఇన్ వ్యవస్థలు పనిచేయడంలేదని వెల్లడించారు. దీంతో విమానాశ్రయాల్లో చెక్ ఇన్, బోర్డింగ్ ప్రక్రియలను ఎయిర్ పోర్ట్ సిబ్బంది మాన్యువల్ గా చేస్తున్నారు. దీనివల్ల విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సమస్యపై మైక్రోసాఫ్ట్ సంస్థ కానీ, విమానయాన సంస్థలు కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమాన సర్వీసులపై ఈ ఎఫెక్ట్ పడింది. అయితే, దీనిపై అటు మైక్రోసాఫ్ట్ గానీ, ఎయిర్‌లైన్ల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కొన్ని విమానాశ్రయాల్లో మంగళవారం రాత్రి నుంచే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం దిల్లీ సహా పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్య కారణంగా వందల సంఖ్యలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దానికి జీపీఎస్ స్పూఫింగ్ కారణమని కేంద్రం ధ్రువీకరించింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) మార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు పార్లమెంట్‌లో వెల్లడించింది. నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ (GPS Signals spoofing)గా వ్యవహరిస్తారు.