Nitish Kumar : వైద్యురాలి హిజాబ్‌ను తొలగించిన నితీష్‌కుమార్.. మరో వివాదంలో బీహార్ సీఎం
నితీష్ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ ఆగ్రహం
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రులు విజయ్ కుమార్ చౌదరి, మంగళ్ పాండే పాల్గొన్నారు.
అయితే వేదికపైన నియామక పత్రాలు అందజేస్తుండగా ఒక ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వచ్చింది. నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్‌ను తొలగించాలని కోరారు. కానీ అంతలోనే ఆమె హిజాబ్‌ను కిందకు గట్టిగా లాగే ప్రయత్నం చేశారు. ఈ హఠాత్తు పరిణామంతో వైద్యురాలు షాక్‌కు గురైంది. అంతేకాకుండా వేదిక దగ్గర ఉన్న నాయకులు, అధికారులు కూడా ఆశ్చర్యపోవడం వంతైంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తనపై విపక్షాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నితీష్ కుమార్ మానసిక పరిస్థితి దయనీయ స్థితికి చేరిందని.. 100 శాతం సంఘీగా మారిపోయారంటూ ఆర్జేడీ విమర్శించింది. అలాగే కాంగ్రెస్ కూడా మండిపడింది. ఇది నీచమైన చర్య అని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. ఈ నీచత్వం క్షమించరానిది అని.. వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా 685 మంది ఆయుర్వేద వైద్యులు, 393 మంది హోమియోపతి వైద్యులు, 205 మంది యునాని వైద్య వైద్యులు నియమితులయ్యారు. అందులో పది మందికి నితీష్ కుమార్ నియామక పత్రాలు అందజేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.