CHHATTISGARH: ప్రాణాలను ఫణంగా పెట్టి కుటుంబ సభ్యుడిని కాపాడిన పిల్లలు
మునిగిపోతున్న తండ్రి కాపాడిన కుమారుడు, మేనల్లుడు
ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు చిన్నారులు కలిసి నదిలో మునిగిపోతున్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడింది ఆయన కుమారుడు, మేనల్లుడే. దీంతో వారిద్దరిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
దమ్తారికి చెందిన సంతోశ్ దేవాంగన్ తన కుమారుడు అశు దేవాంగన్(8), మేనల్లుడు మెహుల్ దేవాంగన్(10) కలిసి ప్రతిరోజులాగే శుక్రవారం రుద్రి నది బ్యారేజీకి స్నానానికి వెళ్లాడు. అయితే ఇద్దరు పిల్లలు రుద్రి నదిలోకి అనుకోకుండా జారిపడ్డారు. దీంతో వారికి వెంటనే సంతోశ్ రక్షించాడు. ఈ క్రమంలో అతడు అదుపుతప్పి నీటిలోకి జారిపోయాడు. సంతోశ్ నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన అశు, మెహుల్ వెంటనే తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ అతడ్ని రక్షించారు. వెంటనే సంతోశ్‌ను అంబులెన్స్‌లో ధమ్తారి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంతోశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
ప్రాణాలకు ఫణంగా పెట్టి
"నేను రోజూ మెహుల్, నా తండ్రి సంతోశ్ దేవాంగన్తో కలిసి రుద్రి బ్యారేజీకి స్నానం చేయడానికి వెళ్తాను. మా నాన్న ఈత కొట్టడం నేర్పిస్తారు. శుక్రవారం ఉదయం 8గంటలకు స్నానం చేయడానికి వెళ్లాం. రుద్రి బ్యారేజ్ వద్ద మా నాన్న సంతోశ్ మునిగిపోతున్నాడు. నేను, మెహుల్ నదిలోకి దూకి ఆయన్ను ఒడ్డుకు చేర్చాం. ఆ తర్వాత ఛాతీపై గట్టిగా పంపింగ్ చేసి నీటిని తొలగించాం. సహాయం కోసం గట్టిగా అరిచాం. మామయ్యకు విషయాన్ని తెలియజేశాం. ఆయన 108కు ఫోన్ చేశారు. ఆ తర్వాత నాన్నను అంబులెన్స్‌లో ధమ్తారి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు" అని సంతోశ్ దేవాంగన్ కుమారుడు అశు తెలిపాడు.
తాను నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన ఇద్దరు పిల్లలు నదిలోకి దూకారని సంతోశ్ తెలిపారు. వారి ప్రాణాలను ఫణంగా పెట్టి తన ప్రాణాలను కాపాడారని చెప్పారు. తనను నది నుంచి కష్టపడి బయటకి తీసుకొచ్చారని వెల్లడించారు.