CJI Surya Kant: ఢిల్లీ కాలుష్యాన్ని పర్యావరణ నిపుణులు పరిష్కరించగలరు.. జస్టిస్ సూర్యకాంత్
డేంజర్‌లో ఢిల్లీ కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టిపీడిస్తోంది. గత కొద్దిరోజులుగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన గాలి లేక ప్రజలు నానా యాతన పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.
తాజాగా ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు తాత్కాలిక పరిష్కారం కాకుండా.. దీర్ఘకాలిక పరిష్కారం వెతకాలన్నారు. ఇందుకోసం పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారం కనుగొంటారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అయినా కూడా కాలుష్యం కంట్రోల్ కాలేదు. పాత వాహనాలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇక పొల్యుషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ నిషేధం విధించారు. ఇక టోల్‌ప్లాజ్‌లు మూసేశారు. అయినా కూడా కాలుష్యం తీవ్రత తగ్గలేదు. ప్రమాదకర స్థితిలో కొనసాగుతోంది.
అలాగే వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ఎంతో విజయవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రక్రియ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇది కేసులోని ఇరుపక్షాలకూ గెలుపు-గెలుపు పరిస్థితిని కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు గోవాలోని పనాజీలో 'మధ్యవర్తిత్వంపై అవగాహన' కోసం ఏర్పాటు చేసిన పాదయాత్రలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో మధ్యవర్తి ఎవరిపైనా తమ నిర్ణయాలను రుద్దరని సీజేఐ స్పష్టం చేశారు. వివాదంలో ఉన్న పక్షాలు కోరుకున్న పరిష్కారాన్నే దీని ద్వారా సాధించవచ్చని తెలిపారు. ఇది ఇరువర్గాల అంగీకారంతో జరిగే పరిష్కారం కాబట్టి, ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.
సుప్రీంకోర్టు 'దేశం కోసం మధ్యవర్తిత్వం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. న్యాయవ్యవస్థలోని భాగస్వాములైన న్యాయవాదులు, న్యాయమూర్తులతో పాటు సాధారణ ప్రజలకు కూడా దీని ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు.
మధ్యవర్తిత్వం ఒక విజయవంతమైన సాధనమని ప్రజలు గుర్తించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. కొన్ని ప్రత్యేక కేసులను మధ్యవర్తిత్వానికి పంపమని హైకోర్టులను, జిల్లా కోర్టులను ఒప్పించగలిగామని తెలిపారు. ఇది పాత, కొత్త కేసులకే కాకుండా, కోర్టుకు రాకముందు దశలో (ప్రీ-లిటిగేషన్) ఉన్న వివాదాలకు కూడా వర్తిస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.