Delhi Cloud Seeding: ఢిల్లీలో 'మేఘ మథనం' విఫలం
కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
దేశ రాజధాని ఢిల్లీని పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యానికి పరిష్కారంగా తలపెట్టిన కృత్రిమ వర్షం ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విఫలమైంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు నిర్వహించిన క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. విమానాల ద్వారా సిల్వర్ అయోడైడ్ ను మేఘాలపై చల్లినప్పటికీ ఒక్క వాన చుక్క కూడా నేల రాలలేదు.
తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగించేందుకు అక్కడి ప్రభుత్వం కృత్రిమ వర్షం కురిపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం క్లౌడ్ సీడింగ్ చేపట్టారు. అయితే ఈ ప్రయోగం విజయవంతం కాలేదు. దీనిపై ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ స్పందించారు. మేఘాల్లో తేమ శాతం అధికంగా ఉండటం వల్లే ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వలేదని ఆయన వివరించారు. మంగళవారం మొత్తం 14 మంటలను (ఫ్లేర్స్) పేల్చినట్లు ఆయన తెలిపారు.
ఈరోజు మరోసారి క్లౌడ్ సీడింగ్ ప్రయోగం నిర్వహిస్తామని అగర్వాల్ వెల్లడించారు. ఈసారైనా ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కాలుష్యానికి శాశ్వత పరిష్కారం కానప్పటికీ, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కాకపోయినా తర్వాత వర్షం కురిసినా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీలో కృత్రిమ వర్షం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు కేటాయించింది. మొత్తం ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఢిల్లీ కేబినెట్ మే 7న ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM), భారత వాతావరణ శాఖ (IMD) నిపుణుల సహకారంతో నిర్వహిస్తున్నారు.