CM Ashok Gehlot: కోటాలో విద్యార్థుల మృతిపై సీరియస్‌

మరణాలను నిరోధించడానికి, సూచనలు అందించడానికి కమిటీ ఏర్పాటు;

Update: 2023-08-19 05:45 GMT

కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణాలను నిరోధించడానికి, సూచనలు అందించడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ప్రతినిధులతోపాటు తల్లిదండ్రులు, వైద్యులతో సహా అన్ని వర్గాలకు చెందిన వారితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఆ కమిటీ 15 రోజుల్లో నివేదికను సమర్పిస్తుందని ప్రకటించారు. కోటాలో ఐఐటీ, నీట్‌ ఔత్సాహికుల ఆత్మహత్యల కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీంఎ 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులపై తల్లిదండ్రులే అధిక భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ, 10వ తరగతుల నుంచే విద్యార్థులను కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేర్చడం ద్వారా తల్లితండ్రులు నేరం చేస్తున్నారన్నారు. అస్సలు వారిని చేర్చుకోవద్దని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ప్రతినిధులకు సైతం సూచించారు.

బోర్డు పరీక్షలను క్లియర్ చేసుకోవాల్సిన పిల్లలు ఒకే సమయంలో ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే భారాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని, ఒక్కరు చనిపోయినా అది ఆ తల్లిదండ్రులకు తీరని లోటన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల మరణాలను నిరోధించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లో తన నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.


డబ్బు సంపాదించే యంత్రాలుగా మారవద్దని, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను కోరారు విద్యాశాఖ సహాయ మంత్రి జాహిదా ఖాన్. ఇది కేవలం రాజస్థాన్‌ సమస్య మాత్రమే కాదని.. యావత్‌ దేశానికి సంబంధించిన సమస్య అని గుర్తించాలన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో సుమారు 13,000 మంది విద్యార్థులు ఆత్మహత్యల ద్వారా మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,834 మరణాలు నమోదుకాగా.. మధ్యప్రదేశ్‌లో1,308 మంది, తమిళనాడులో 1,246 మంది, కర్ణాటకలో 855 మంది, ఒడిశాలో 834 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు నివేదికలో ప్రకటించారు.

మరోవైపు కోటాలో ఎక్కువ సంఖ్యలో బలవన్మరణాలు ఫ్యాన్‌కు ఉరివేసుకుని జరిగినవేనని గుర్తించి ఓ ఉపాయం చేశారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లలో లోడ్‌ పడగానే కిందకు వచ్చే స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను బిగించాలని నిర్ణయించారు. కోటాలోని అన్ని హాస్టళ్లు, పెయింగ్ గెస్ట్‌ గదుల్లో శరవేగంగా ఈ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు…

కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిలో ఈ ఏడాది ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది మొత్తంలో 15 మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 22కి చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News