Delhi Election Results: విజయోత్సవ సంబరాల్లో డ్యాన్స్ చేసిన అతిషి
సీఎంపై స్వాతి ఫైర్!;
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి చెందినా.. ముఖ్యమంత్రి అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. దీంతో ఆమె మద్దతుదారులు, కార్యకర్తలతో కలిసి ఉల్లాసంగా.. ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ తగినట్టుగా నృత్యం చేశారు. కార్యకర్తలను ఉత్తేజపరిచారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురిపై అతిషి విజయం సాధించారు.
అయితే సొంత పార్టీ ఓడినా అతిశీ ఇలా డాన్స్ చేస్తున్నారేంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అతిషి వేడుకలను ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రంగా విమర్శించారు, ఆమె దీనిని సిగ్గులేని ప్రదర్శనగా అభివర్ణించారు. "ఇది ఎలాంటి సిగ్గులేని ప్రదర్శన? పార్టీ ఓడిపోయింది, సీనియర్ నాయకులందరూ ఓడిపోయారు. అతిషి మార్లెనా ఇలా జరుపుకుంటుందా? అని మాలివాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.