జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసికట్టుగా పోటీ చేయనున్నట్లు శనివారం ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. రాష్ట్రంలోని 81 స్థానాల్లో.. కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు 70 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే సీట్ల పంపకం విషయంలో ఇప్పుడే పూర్తి వివరాలను వెల్లడించలేమని, తమ కూటమి పార్టీ ఇప్పుడు తమతో లేదని, వాళ్లు మా వద్దకు వచ్చినప్పుడు, పార్టీ సీట్లను ఫైనలైజ్ చేస్తామని సోరెన్ తెలిపారు. మిగితా 11 స్థానాల కోసం.. ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతోనూ సీట్ల పంపకం విషయంలో చర్చలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనున్నది. నవంబర్ 13వ తేదీన తొలి దశ, 20వ తేదీన రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 23వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. గత ఎన్నికల్లో జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేశాయి. ఈసారి జేఎంఎం తమ సీట్ల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.