Loksabha Elections: ఎన్నికల్లో వాడు ఓడిపోవాలని కోరుకుంటున్నా : ఏకే ఆంటోనీ
బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడికి ఓటమి తప్పదన్న కాంగ్రెస్ సీనియర్ నేత;
ఎన్నికల్లో తమ వారసులు ఎవరైనా బరిలో ఉంటే గెలవాలని కోరుకుంటారు. కానీ కేరళలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ఘటన చోటు చేసుకుంది. కేరళ మాజీ సీఎం, సుదీర్ఘ కాలంపాటు దేశ రక్షణ మంత్రిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత AK ఆంటోనీ తన సొంత కొడుకు ఓడిపోయాలని కోరుకుంటున్నారు. AK ఆంటోనీ కాంగ్రెస్‌లో ఉండగా ఆయన కొడుకు అనిల్ ఆంటోనీ భాజపా అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుండటమే అందుకు కారణం.
సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని పతనంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన తన కొడుకు అనిల్ ఆంటోని ఓడిపోవాలని కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కోరుకున్నారు. పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గంలో తన కొడుకు ఓడి....కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనీ సంపూర్ణ ఆధిక్యంతో గెలుస్తారని ఈ మాజీ రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్సే తన మతమన్న 83 ఏళ్ల AK ఆంటోనీ, కాంగ్రెస్ నేతల పిల్లలు భాజపాలో చేరడం తప్పని వ్యాఖ్యానించారు. సుధీర్ఘకాలం పాటు దేశ రక్షణశాఖ మంత్రి విధులు నిర్వర్తించిన AK ఆంటోనీ.. ఈ ఎన్నికలను చావో-రేవే తేల్చుకునే యుద్ధంగా అభివర్ణించారు. ఆరోగ్య సమస్యల కారణంగా కాంగ్రెస్ తరఫున ప్రచారానికి వెళ్లలేకపోతున్నానని తెలిపారు. కేరళలో భాజపా మరింత దిగజారుతుందని.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతుందని ఏకే ఆంటోనీ మీడియా సమావేశంలో తెలిపారు. శబరిమలలో మహిళల ప్రవేశ వివాదాన్ని ఆసరాగా చేసుకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో అదనపు ఓట్లను భాజపా కూడగట్టగలిగిందని పేర్కొన్నారు.ఈ సారి అటువంటి పరిస్థితులు లేవని...కచ్చితంగా భాజపా ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో తగ్గుతుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ పాలన అంతమొందించేందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం ధ్వంసమవుతుందని వ్యాఖ్యానించారు. కేరళ మాజీ సీఎం దివంగత కాంగ్రెస్ నేత కే. కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్ భాజపాలో చేరిన అనంతరం ఆ రాష్ట్రంలో నిస్సత్తువ ఆవరించిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఏకే ఆంటోనీ ప్రకటన తిరిగి ఉత్తేజాన్ని నింపుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
AK ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ గతేడాది ఏప్రిల్‌లోనే భాజపాలో చేరారు. ఆ పార్టీలో చేరకముందు కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ కో- ఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తించారు. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోదీపై BBC డాక్యుమెంటరీ వ్యవహారంతో విభేదించి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తాను చేసిన ట్వీట్ ను వెనక్కి తీసుకోవాలంటూ వచ్చిన ఒత్తిడి వల్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు అనిల్ ఆంటోనీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని పతనంతిట్ట స్థానం నుంచి అనిల్ ఆంటోనీని భాజపా తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది.