Congres: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపికపై ఇవాళ తుది నిర్ణయం ?
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రాష్ట్ర హస్తం పార్టీ అభ్యర్ధుల ఎంపికపై ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 15న అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు PCC వర్గాలు వెల్లడించాయి. నేడు దిల్లీలో జరిగే సీఈసీ సమావేశానికి అందుబాటులో ఉండాలని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, CLP నేత భట్టి విక్రమార్కలకు పార్టీ అధిష్ఠానం సూచించింది. అసంతృప్తులను బుజ్జగించేందుకు జానారెడ్డి నేతృత్వంలోని సమన్వయ కమిటీ ప్రయత్నిస్తోంది.
రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన విషయంలో అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల జాబితా విడుదల ఎప్పుడనే స్పష్టత లేక శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఇప్పటికే గులాబీ నాయకులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికపై భాజపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అభ్యర్ధులను త్వరతిగతిన ప్రకటించకపోతే...ప్రచారంలో వెనుకబడి పోతామనే ఆందోళన టికెట్లు ఆశిస్తున్న నేతల్లో వ్యక్తమవుతోంది. కనీసం వివాదరహిత నియోజకవర్గాలకైనా అభ్యర్ధులను మొదటి జాబితా కింద ప్రకటించాలని కోరుతున్నారు.
ఇవాళ దిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. రాష్ట్ర అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు దిల్లీ చేరుకున్నారు. మూడు దఫాలు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై వందకుపైగా నియోజక వర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇవాళ్టి సీఈసీ భేటీలో రాష్ట్ర అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 15న 60 నుంచి 65 స్థానాలకు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది. వామపక్షాల పొత్తులు కొలిక్కి రాకపోవడం, మరికొందరు పార్టీలో చేరేవారున్న దృష్ట్యా ఆ దిశలో కసరత్తు జరుగుతోంది. 34 టికెట్లు కేటాయించాలని BCలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు తమ ప్రాతినిధ్యం పెంచాలని నినదిస్తున్నారు. కమ్మ సామాజికవర్గం తమ వర్గానికి తగినన్ని సీట్లు కావాలని అభ్యర్థిస్తున్నారు.
టికెట్లు ప్రకటిస్తే...పార్టీ నాయకుల్లో పెల్లుబికే అసంతృప్తిని చల్లార్చేందుకు…అధిష్టానం ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల సమన్వయ కమిటీ ఇప్పటికే రంగంలోకి దిగింది. రెండు రోజులుగా జానారెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ నియోజక వర్గాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తోంది. జానారెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, దీపా దాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌లు గంటలతరబడి సమాలోచనలు చేస్తున్నారు. నాయకులను ఏవిధంగా సమన్వయం చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అసమ్మతులను బుజ్జగించే పని పూర్తి చేయాలని సమన్వయ కమిటీ భావిస్తోంది