Bharat Jodo Yatra కాంగ్రెస్ భారత్ జోడోయాత్ర 2
2024 జనవరి నుంచి ప్రారంభం;
దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండో దశ భారత్ జోడో యాత్ర 2024 ను జనవరి మొదటివారంలో ప్రారంభించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రెస్ యోచిస్తుందని ఢిల్లీ వర్గాల సమాచారం. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర 2.0 హైబ్రిడ్ మోడ్‌లో ఉంటుందని, ఇందులో పాల్గొనేవారు కాలినడకతో పాటు వాహనాలను కూడా ఉపయోగించనున్నారని అంటున్నారు.
భారత్ జోడో యాత్ర 2 ఈశాన్య రాష్ట్రం నుంచి ప్రారంభమై ఉత్తరప్రదేశ్, బీహార్ ,మహారాష్ట్రల మీదుగా సాగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సాగనున్న ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 21న జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ప్రతిపాదిత భారత్ జోడో యాత్రపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.
2022 సెప్టెంబరు 7వతేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మొదటి దశ జనవరి 2023లో జమ్మూ, కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగియడానికి ముందు 4,080 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా సాగింది. 126 రోజుల్లో భారతదేశంలోనే సుదీర్ఘమైన పాదయాత్రగా గుర్తించారు.
ఈ జోడో యాత్రకు నాయకత్వం వహించిన రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని ఏకం చేయడం, నిరుద్యోగం, అసమానతల వంటి ఇతర సామాజిక-ఆర్థిక సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఈ భారత్ జోడో యాత్ర సాగింది.