Congress: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
తెలంగాణలో నలుగురి పేర్లు ఖరారు;
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 8వ తేదీ శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో జహీరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, మహబూబాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి.
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తొలి విడతలో ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. మొత్తం 39 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో భాగంగా 4 పేర్లను వెల్లడించింది. ఇప్పటికే మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను వంశీ చంద్ రెడ్డికి ఇవ్వగా.. తాజాగా మరో నలుగురి పేర్లను ప్రకటించింది. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తినప్పటికీ.. ఆయన మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్నారు.
జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్‌కు అవకాశం కల్పించింది. ఇక చేవెళ్ల నియోజకవర్గం నుంచి సునీతా మహేందర్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిపింది. నల్గొండ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ హై కమాండ్ స్పష్టం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇక ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్.. రాజ్ నందగావ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్.. బెంగళూరు రూరల్ స్థానం నుంచి బరిలో నిలిచారు.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల నుంచి ఈసారి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై సుదీర్ఘ కసరత్తు నిర్వహించింది. అయితే గురువారం రాత్రే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల అవుతుందని వార్తలు రాగా విడుదల చేయలేదు.శుక్రవారం 39 మందితో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.