Congress: బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుల వ్యూహం..
Congress: బీజేపీని ఢీకొట్టాలంటే ఓ మెట్టు తగ్గాల్సిందేనంటూ కాంగ్రెస్ అధినాయకత్వానికి తేల్చిచెప్పారు జీ-23 నేతలు.;
Congress: బీజేపీని ఢీకొట్టాలంటే ఓ మెట్టు తగ్గాల్సిందేనంటూ కాంగ్రెస్ అధినాయకత్వానికి తేల్చిచెప్పారు జీ-23 నేతలు. కాంగ్రెస్ నాయకత్వం మారాలని డిమాండ్ చేస్తున్న 23 మంది కాంగ్రెస్ సీనియర్లు.. అధినాయకత్వ తీరును నిరసిస్తున్నారు. 2024లో ప్రభావం చూపాలంటే.. భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి నడవక తప్పదని చెబుతున్నారు. అలాంటి పార్టీలతో ఇప్పటి నుంచే సంప్రదింపులు, చర్చలు మొదలుపెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు.
గులాం నబీ ఆజాద్ ఇంట్లో మరోసారి సమావేశమైన జీ-23 నేతలు.. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్‌లో అంతర్గత మార్పులపై చర్చించారు. కొత్తగా ఈ గ్రూపులోకి పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్, గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్, హర్యానా మాజీ స్పీకర్ కుల్దీప్ శర్మ కూడా వచ్చి చేరారు.
2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పటిష్ట కార్యాచరణ చేపట్టాలని, పార్టీలో అందరినీ కలుపుకొనిపోవాలని 23 మంది నేతలు తీర్మానించారు. అయితే, గ్రూప్-23 నేతలపై కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని విడగొట్టడానికి ఆ 23 మంది నేతలు ప్రయత్నిస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
పార్టీలో సంస్కరణల గురించి ఆలోచించాలన్నా, చర్చించాలన్నా సీడబ్ల్యూసీలోనే జరగాలని, ఇప్పటికే ఆ అంశాలను సీడబ్ల్యూసీలో చర్చించామని చెప్పుకొచ్చారు. అయినా సరే.. గులాంనబీ ఆజాద్ ఇంట్లో జీ-23 నేతలు మళ్లీ మీటింగ్ పెట్టుకోవడంలో అర్థం లేదని విమర్శించారు. సోనియా నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ నేతలంతా సోనియాతోనే ఉన్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు.
మరోవైపు పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అధినేత్రి సోనియా గాంధీ. సంస్థాగత మార్పులపై సూచనలు ఇచ్చేందుకు ఐదుగురు సీనియర్ నాయకులను నియమించారు. ఈ నేతలు మొన్నటి ఐదు రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని పరిశీలిస్తారు. ఆయా రాష్ర్టాల్లో సంస్థాగత మార్పులపై సూచనలు చేస్తారు.