INDIA Allies: సీట్ల సర్దుబాటుపై ముమ్మర ప్రయత్నాలు

ఇండియా కూటమి విభేదాలు..

Update: 2024-01-07 03:45 GMT

 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఇండియా కూటమిగా జట్టుకట్టిన ప్రతిపక్ష పార్టీలు సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. సీట్ల సర్దుబాటుపై అక్కకడక్కడా బయటపడిన విభేదాలు చిన్నవే అని వాటిని పరిష్కరించుకుంటామని నేతలు చెబుతున్నారు. 400 స్థానాల్లో భాజపాకు గట్టిపోటీ ఇస్తామని ధీమా వ్యక్తంచేస్తున్న కూటమి నేతలు సీట్ల సర్దుబాటు తర్వాత ఉమ్మడి ప్రచారంపై దృష్టి సారిస్తామని అంటున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష ఇండియా కూటమి పావులు కదుపుతోంది. కమలంపార్టీని ఓడించాలంటే ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఐక్యంగా పోటీచేయాలన్న నిర్ణయంలో భాగంగా సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించారు. కలిసి పోటీ చేసే స్థానాలపై కొన్నిచోట్ల విభేదాలు తలెత్తినా...సుమారు 400స్థానాల్లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుందని విపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో దిల్లీలో జరిగిన విపక్ష ఇండియా కూటమి నాలుగో సమావేశంలో సీట్ల సర్దుబాటుపై విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలో పశ్చిమ బంగాల్‌కు సంబంధించి అధికార టీఎంసీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. బహ్రంపుర్, దక్షిణమల్దా లోక్‌సభ స్థానాలు మాత్రమే ఇస్తామని టీఎంసీ పేర్కొనటంపై హస్తంపార్టీ తీవ్రంగా మండిపడింది. అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు మరింత సమయం ఇస్తున్నట్లు తృణమూల్ తెలిపింది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లశాతాన్ని పరిగణలోకి తీసుకుని సీట్లు కేటాయించాలని టీఎంసీ కోరుతోంది.

ఇండియా కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్...సీట్ల సర్దుబాటును ముందుండి నడిపించాలని...ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు కోరుతున్నారు. అన్ని పార్టీలకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే...ఎన్నికల్లో కూటమి విజయానికి వ్యూహ రచన చేయాలని సూచిస్తున్నారు. కూటమిలోని పార్టీలు పరస్పర గౌరవంతో తగిన ప్రాధాన్యం ఇచ్చిపుచ్చుకోవాలని కమ్యూనిస్టులుసహా ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. సీట్ల ఖరారు తర్వాత ఉమ్మడిప్రచారం విషయంలోనూ అన్నిపార్టీలు ఐక్యంగా ఉండాలని కూటమి నేతలు కోరుతున్నారు.

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో...అసోం కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. భాజపాను ఓడించేందుకు అసోంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లు అసోం పీసీసీ చీఫ్ జితేంద్రసింగ్ తెలిపారు. AIUDFమినహా 16పార్టీలు విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయని చెప్పారు

Tags:    

Similar News