MahaKumbh Mela: ఖర్చు లేకుండా కుంభమేళాకి వెళ్ళి వచ్చాడు
ముంబై నుంచి మహాకుంభ్‌కు;
కంటెంట్ క్రియేటర్ దివ్య ఫొఫానీ అరుదైన సాహసం చేశారు. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా అపరిచితుల దాతృత్వంపై ఆధారపడి ముంబై నుంచి మహాకుంభ్‌కు సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తిచేశారు. ఈ నెల 12న ముంబైలో ప్రారంభమై రెండు రోజుల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన ఈ ఉత్కంఠభరిత యాత్రను విశ్వాసం, సాహసం, మానవ దయతో కూడిన అద్భుత సాహసయాత్రగా ఫొఫానీ అభివర్ణించారు.
అద్వితీయమైన ఈ తీర్థయాత్రపై ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుకు ఇప్పటికే 36 వేలకుపైగా లైక్‌లు లభించాయి. ఈ యాత్ర తనకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని, పవిత్ర స్థలాన్ని చేరుకునేందుకు భారతీయులు ఎలాంటి సంకోచం లేకుండా పరస్పరం ఎలా సహకరించుకుంటారో ఈ ప్రయాణంలో ప్రత్యక్షంగా చూశానని, అపరిచితుల దయాగుణంతోపాటు అద్భుతమైన మన దేశ ఐక్యతపై తనకున్న విశ్వాసాన్ని ఈ యాత్ర మరోసారి చాటిచెప్పిందని ఫొఫానీ పేర్కొన్నారు.
‘లిఫ్ట్’ అని రాసిన ప్లకార్డును చేతపట్టుకుని ముంబై శివారులోని థానే నుంచి బయలుదేరిన ఫొఫానీ తొలి విడతలో బైకులు, స్కూటర్లు, కార్లు, ట్రక్కులపై ప్రయాణించి నాగ్‌పూర్‌కు చేరుకోవడం ద్వారా తన మొత్తం 1,500 కి.మీ. యాత్రలో సగభాగాన్ని పూర్తిచేశారు. తదుపరి విడతలో జబల్‌పూర్ (మధ్యప్రదేశ్) వరకు పలువురు దయామయులు లిఫ్ట్ ఇవ్వడంతో ఆయన ప్రయాణం సాఫీగానే సాగింది. జబల్‌పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ట్రక్కులకు అనుమతించకపోవడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయని, అయినప్పటికీ స్థానికుల తోడ్పాటుతో యాత్రను పూర్తి చేయగలిగానని అన్నారు.