Haryana: సూరజ్‌కుండ్ మేళాలో జెయింట్ స్వింగ్ కూలి ఇన్‌స్పెక్టర్ మృతి

ఘటనలో 13 మందికి పైగా సందర్శకులకు గాయాలు

Update: 2026-02-08 01:15 GMT

హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్ అంతర్జాతీయ మేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సందర్శకులతో కిక్కిరిసిన ఓ భారీ జెయింట్ స్వింగ్ (సునామీ స్వింగ్) శనివారం సాయంత్రం అకస్మాత్తుగా విరిగిపడింది. ఈ ఘోర దుర్ఘటనలో విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కోల్పోగా, 13 మందికి పైగా గాయపడ్డారు.

సూరజ్‌కుండ్ మేళాలో ఏర్పాటు చేసిన అమ్యూజ్‌మెంట్ రైడ్లలో ఒకటైన జెయింట్ స్వింగ్ నడుస్తుండగా ఒక్కసారిగా దాని పిల్లర్లలో ఒకటి విరిగిపోయింది. దీంతో స్వింగ్ అదుపుతప్పి నేలకూలింది. ప్రమాదాన్ని గమనించిన ఇన్‌స్పెక్టర్ జగదీశ్ ప్రసాద్ (59) వెంటనే స్పందించి, ప్రజలను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కూలుతున్న స్వింగ్ నుంచి ఓ భారీ ఇనుప భాగం ఆయనపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా జగదీశ్ ప్రసాద్ మరణించడం తీవ్ర విచారాన్ని నింపింది.

ఈ ప్రమాదానికి గంట ముందు మేళా ప్రాంగణంలోనే ఓ గేటు కూలి ఇద్దరు గాయపడ్డారు. వరుస ఘటనలతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మేళాను ఖాళీ చేయించి, సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సైనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన రైడ్ నిర్వాహకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Tags:    

Similar News