Delhi Corona : ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు..

Delhi Corona : దేశవ్యాప్తంగా కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ రాజధానిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

Update: 2022-08-17 02:22 GMT

Delhi Corona : దేశవ్యాప్తంగా కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ రాజధానిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిరోజు రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి. ప్రతిరోజు సగటున 8 నుంచి 10 మంది మృతిచెందుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణలు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ వ్యాప్తిని చూస్తున్నామని... అధిక కేసులు, పాజిటివిటీ రేటు నమోదవుతోందని అన్నారు. మహమ్మారి ఇంకా కొనసాగనుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు.

రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోమవారం, మంగళవారం మినహా.. గడిచిన 12రోజులు ఢిల్లీలో వరుసగా 2వేలకు పైగానే కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో 917 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, పాజిటివిటీ రేటు మాత్రం 19.20 శాతంగా ఉంది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేసుల విజృంభణతో ఢిల్లీ ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది.

Tags:    

Similar News