Cough Syrup: ఈ దగ్గు సిరప్ వల్ల ఇద్దరు పిల్లలు మృతి..

సిరప్ పేరు డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్.

Update: 2025-10-01 00:46 GMT

చిన్న పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వంటివి రాగానే చాలా మంది వెంటనే మెడికల్‌ షాక్‌కు వెళ్లి, వారికి తెలిసిన సిరప్‌లు తెచ్చి వేస్తుంటారు. హాస్పిటల్‌కు వెళ్తే టెస్టులంటూ డాక్టర్లు తమను పిండేస్తారని భయపడి ఎక్కువమంది తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు. అయితే కొంతమంది మెడికల్‌ షాప్‌ నిర్వహకులకు సరైన అవగాహన లేక ఏ సిరప్‌ పడితే ఆ సిరప్‌ ఇచ్చేస్తుంటారు. కొన్ని సార్లు అవి పిల్లలకు ప్రమాదకరం కావొచ్చు. తాజాగా ఓ దగ్గు సిరప్‌ కారణంగా ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. సికార్‌లో ఐదేళ్ల చిన్నారి మరణించింది. దగ్గు సిరప్ తీసుకున్న వెంటనే ఆ చిన్నారి శ్వాస ఆగిపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. జైపూర్‌లో ఇలాంటి కేసు వెలుగులోకి రాగా శ్రీమధోపూర్, భరత్‌పూర్‌లలో కూడా సంఘటనలు నమోదయ్యాయి. జైపూర్‌లో అదే మందు తీసుకున్న రెండేళ్ల బాలికను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో చేర్చాల్సి వచ్చింది. ఈ సిరప్ పేరు డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్. ఈ సిరప్‌ను తాగిన తర్వాత సికార్, భరత్‌పూర్‌లలో ఇద్దరు పిల్లలు మరణించారని సమాచారం.

ఈ సిరప్‌ జూన్‌లో సరఫరాలోకి వచ్చింది. ఈ ఔషధాన్ని స్థానిక జైపూర్ కంపెనీ కేసన్స్ ఫార్మా తయారు చేస్తుంది. ఈ సంఘటన తర్వాత రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఔషధ సరఫరాను నిలిపివేసింది. ఔషధ విభాగం పరీక్ష కోసం నమూనాలను సేకరించింది. ఐదు నుంచి ఆరు రోజుల్లో వివరణాత్మక దర్యాప్తు నివేదిక వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ మందు పిల్లలకు కాదు, పెద్దలకు మాత్రమే అని తేలింది.

Tags:    

Similar News