Crime news : తల్లిని చంపి శవం పక్కన పాటలు... ఆటలు
నాలుగు గంటల పాటు శ్రమించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు;
కన్నతల్లినే గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన ఓ కొడుకు ఆమె శవం పక్కనే గంటల తరబడి కూర్చుని పాటలు పాడుతూ కనిపించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు నాలుగు గంటల సమయం పట్టింది.
జశ్‌పూర్ జిల్లాలోని కున్‌కురి పట్టణంలో జీత్ రామ్ యాదవ్ (28) అనే యువకుడు తన తల్లి గులాబీ (59)తో కలిసి నివసిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జీత్ రామ్ ఒక్కసారిగా తన తల్లిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం, రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి శవం పక్కనే కూర్చుని పాటలు పాడుతూ, ఇసుకతో ఆడుకుంటూ వింతగా ప్రవర్తించాడు.
ఈ దృశ్యం చూసి షాక్‌కు గురైన స్థానికులు అతడి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా చేతిలో ఉన్న గొడ్డలిని గాల్లో తిప్పుతూ వారిని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా జీత్ రామ్ దాడికి ప్రయత్నించాడు.
అయితే, పోలీసులు సంయమనం పాటిస్తూ అతడిని మాటల్లోకి దించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఎంతో చాకచక్యంగా చర్చలు జరిపి, చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.