CRPF: పాకిస్థాన్ మహిళతో వివాహం.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ డిస్మిస్..
విషయం దాచిపెట్టడంపై ఉన్నతాధికారులు సీరియస్..;
పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ మునీర్ అహ్మద్‌ని ఉద్యోగం నుంచి తొలగించింది. 41వ బెటాలియన్‌కి చెందని మునీర్ పాక్ మహిళను పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచిపెట్టడంతో పాటు ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. అతడి చర్యలు సర్వీస్ రూల్స్‌ని ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు హానికరమని సీఆర్‌పీఎఫ్ తెలిపింది.
గత వారం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారతదేశంలో ఉంటున్న పాక్ జాతీయులకు కేంద్రం వీసాలు రద్దు చేసి, డెడ్‌లైన్‌లోగా పాకిస్తాన్ వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మునీర్ అహ్మద్‌ని పెళ్లి చేసుకున్న పాక్ మహిళ మినాల్ ఖాన్ కూడా బహిష్కరణకు గురైంది. ఆమెను అట్టారి-వాఘా బోర్డర్‌కి పంపారు. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు భారతదేశంలో 10 రోజులు ఉండటానికి అనుమతి ఇచ్చారు.
జమ్మూకు చెందిన శ్రీ అహ్మద్ 2017లో దళంలో సీఆర్‌పీఎఫ్‌లో చేరాడు. అయితే, పాక్‌కి చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు ముందుగా ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు, అయితే అనుమతి రాకముందే పెళ్లి చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది వీరిద్దరు మే 24న వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నారు. వీసాపై వచ్చిన మినాల్ ఖాన్ అహ్మద్‌తో కలిసి జీవిస్తోంది. ఆమె వీసా గడువు మార్చి 22తో ముగిసింది. అయినా కూడా ఆమెకు అహ్మద్ ఆశ్రయం కల్పించాడు.