Dead Body Donation: ఆస్పత్రికి తండ్రి డెడ్​బాడీ డొనేట్ చేసిన కొడుకులు

నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు

Update: 2024-05-13 03:30 GMT

చనిపోయాక తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలని తండ్రి చెప్పిన మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. అశ్రునయనాలతో తమ కన్నతండ్రి పార్థివ దేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉన్న మెడికల్ కాలేజీకి అందజేశారు.

వివరాల్లోకి వెళితే, ఉత్తర్​ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన కృష్ణ కుమార్ సోని(78) టెలీ కమ్యూనికేషన్స్ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌ హోదాలో 2006లో రిటైరయ్యారు. ఆయన శుక్రవారం రోజు(మే 10వ తేదీన) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తాను చనిపోయాక భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనలకు ఇచ్చేయాలని కృష్ణ కుమార్ సోని తరుచుగా తన పిల్లలకు చెబుతుండేవారు. ఇదే తన చివరి కోరిక అని అంటుండేవారు.

ఉద్వేగానికి లోనవుతూ, చెమర్చిన కళ్లతో తమ తండ్రి చివరి కోరికను నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని కృష్ణ కుమార్ సోని పెద్ద కుమారుడు ఆనంద్  చెప్పారు. భారత్​ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్​ (భెల్) కంపెనీలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) హోదాలో పనిచేస్తున్న ఆనంద్ ఈ విషయాన్ని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఉత్తర్​ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉన్న మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తమ తండ్రి భౌతిక కాయాన్ని అప్పగించామన్నారు   "వైద్య పరిశోధనల కోసం, వైద్య విద్యార్థులకు నాలెడ్జ్ పెరిగేందుకు తన దేహం పనికి రావాలని మా నాన్న చెబుతుండేవారు" అని ఆనంద్ తెలిపారు.

"మా తమ్ముడు అనుపమ్ ఇందౌర్​లో నివసిస్తున్నాడు. అతడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మా సోదరి అనురాధకు పెళ్లయింది. ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటోంది. నాన్నగారు చనిపోయారని తెలియగానే వాళ్లంతా మా స్వస్థలం ఝాన్సీకి వచ్చారు. మేమంతా కలిసి నాన్న భౌతికకాయాన్ని తీసుకెళ్లి మెడికల్ కాలేజీకి అప్పగించాం" అని చెమర్చిన కళ్లతో ఆనంద్ వివరించారు. తమకు మంచి కెరీర్ అందించడం కోసం నాన్న ఎంతో శ్రమించారని ఆయన ఆనందర్ వెల్లడించారు.

Tags:    

Similar News