Deepfake Scam: సద్గురు డీప్‌ఫేక్ వీడియోతో మహిళ నుండి రూ.3.75 కోట్లు స్వాహా
250 అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు అంటూ వీడియొ
రోజురోజుకి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళను రూ. 3.75 కోట్లకు పైగా మోసం అది కూడా ఆధ్యాత్మిక గురువు సద్గురు పేరుతో . ఈ ఘటన బెంగుళూరులోని సీవీ రామన్ నగర్‌లో జరిగింది. బాధితురాలు వర్ష గుప్తా ఫిబ్రవరి 25న తన యూట్యూబ్ ఛానెల్ చూస్తుండగా, సద్గురు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఒక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియో ఆమె కంటపడింది. ఆ వీడియోలో, సద్గురు కేవలం 250 అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు పొందవచ్చని చెబుతున్నట్టుగా ఉంది. డీప్‌ఫేక్ టెక్నాలజీ గురించి తెలియని వర్ష, ఆ వీడియోను నిజమని నమ్మి దాని కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసింది.
లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, వలీద్ బి అనే వ్యక్తి వర్షను సంప్రదించాడు. తాను ‘మిర్రాక్స్’ అనే ట్రేడింగ్ యాప్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. వలీద్ వివిధ దేశాల ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ ద్వారా ఆమెతో టచ్‌లో ఉన్నాడు. ఆ తరువాత, ‘మిర్రాక్స్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని చెప్పి, జూమ్ కాల్స్ ద్వారా ట్రేడింగ్‌లో శిక్షణ ఇచ్చాడు. వలీద్ అందుబాటులో లేనప్పుడు, మైఖేల్ సి అనే మరొక వ్యక్తి ఆమెకు మార్గదర్శనం చేసేవాడు.
ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో, మోసగాళ్లు చెప్పినట్లుగా వర్ష తన బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుండి రూ. 3.75 కోట్లను వారికి బదిలీ చేసింది. ఆ తర్వాత డబ్బు మొత్తం కోల్పోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీప్‌ఫేక్ వీడియోలు ఎంత ప్రమాదకరంగా మారాయో, సైబర్ నేరాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.