Swami Chaitanyananda News: కమ్ టు మై రూమ్..అంటూ బాబా మెసేజ్‌లు.. స్వామి చైతన్యానంద లీలలు..
స్వామి చైతన్యానంద సరస్వతి కోసం పోలీసుల వేట
న్యూఢిల్లీలోని ప్రముఖ విద్యా, ఆధ్యాత్మిక సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, తనను తాను ‘‘బాబా’’గా చెప్పుకునే స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుపై పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు. ఆగస్టు 2025లో అనేక మంది మహిళా విద్యార్థినులు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఒడిశాలో పుట్టిన పార్థసారధి, ఆ తర్వాత బాబాగా మారి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లారు, ఇప్పుడు ఈ ఆరోపణలతో అసలు స్వరూపం బయటకు వచ్చింది.
విద్యార్థినులకు ‘‘బేబీ’’, ‘‘ఐ లవ్ యూ’’ అంటూ మెసేజ్‌లు పంపినట్లు తేలింది. విద్యార్థినుల హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్‌ను పొగుడుతూ మాట్లాడే వాడని అధికారులు ధ్రువీకరించారు. 2024 అక్టోబర్‌లో అడ్మిషన్ పొందిన కొద్ది సమయానికే ఒక విద్యార్థిని ఎలా వేధించాడనే విషయాన్ని ఎఫ్ఐఆర్ ప్రస్తావించింది. ఆ ఏడాది దీపావళి ముందు తను పిలిపించారని, అతను వింతగా చూసేవాడని ఆమె ఆరోపించింది. డిసెంబర్‌లో తన కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత, ఎక్స్-రే షేర్ చేయాలని ఆదేశించాడని, అప్పటి నుంచి తనతో అనుచితంగా, బలవంతపు సందేశాలు పంపేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
‘‘నువ్వు ఈ రోజు అందంగా కనిపిస్తున్నావు’’, ‘‘నేను నిన్ను ఆరాధిస్తున్నాను’’ వంటి మేసేజులను ప్రతీరోజు పంపే వారని విద్యార్థినులు ఆరోపించారు. వీటికి స్పందించకుంటే, మార్కులు తక్కువగా ఇస్తానని,నోటీసులు ఇస్తానని వేధించే వాడనే ఆరోపణలు ఉన్నాయి. 2025లో బీఎండబ్ల్యూ కారు పూజ నెపంతో బాబా తనను తన క్వార్టర్‌కు పిలిచాడని ఆరోపించింది. ఆ రాత్రి తనను వ్యక్తిగతంగా కలవాలని మెసేజ్ చేశాడని చెప్పింది.
2025 జూన్ లో రిషికేష్ పర్యటనలో అనేక మంది విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిఘటించిన విద్యార్థినులకు మార్కులు తగ్గించాడని తెలుస్తోంది. తాజా ఫిర్యాదులో మొత్తం 17 మంది మహిళా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు 50 మంది విద్యార్థిను నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇతడిపై 2009, 2016లో కూడ లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చాయి. అయితే, తన ప్రభావం, పలుకుబడితో ఇందులో నుంచి తప్పించుకున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.